Sunday, September 14, 2025
E-PAPER
Homeఅంతరంగంనమ్మకం

నమ్మకం

- Advertisement -

నమ్మకమే అనుబంధాల్ని శాశ్వతం చేస్తుంది. నమ్మకం అనేది ఉంటే జీవితమంతా హాయిగా బతికేయవచ్చు. అయితే ఈ నమ్మకంతోనే ఎదుటి వారిని మోసం చేస్తుంటారు కొందరు. స్నేహితుల్లోనే కాదు.. బంధువుల, అత్యంత సన్నిహితుల్లోనూ ఇలాంటి వారుంటారు. మన ముందు ప్రేమగా ఉంటూనే వెనకాల మన పతనాన్ని కోరుకుంటారు. మనం సంతోషంగా ఉండడం చూడలేరు. పరోక్షంగా ఆ ఆనందనాన్ని హరించాలని చూస్తుంటారు. ఇలాంటి వారితో ఎప్పటికైనా ప్రమాదమే.
మరి ఇలాంటి వారిని గుర్తించడం ఎలా..! వ్యక్తుల ప్రవర్తన, నడవడికను బట్టి వారు మీపై చూపే ప్రేమ, అభిమానం అసలైనదా కాదా అనేది గుర్తించవచ్చు. మనముందు ఒకలా వెనక మరోలా ప్రవర్తించే వాళ్ల ఆలోచనలు, స్వభావం చేతలు స్థిరంగా ఉండవు. పరిస్థితుల్ని బట్టి వాటిని తమకు అనువుగా మార్చుకుంటారు. ఇలాంటి వారికి ఎదుటివారు బాధపడతారేమో అనే ఆలోచనే ఉండదు. ముఖ్యంగా ఇలాంటి వారు డబ్బు, పలుకుబడి ఉన్నవారి వద్ద అణిగిమణిగి ఉన్నట్టు నడిస్తారు. వాళ్లు ఏం చెప్పినా సరైనదే అన్నట్టు ప్రవర్తిస్తారు. అదే బంధువుల దగ్గరికి వచ్చేసరికి భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. తమ ఆలోచనలే సరైనవనట్టు గొప్పలు చెప్పుకుంటారు.
మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే నకిలీ వ్యక్తుల నవ్వు కూడా నకిలీగానే ఉంటుంది. మీకు మంచి జరిగినా.. మీ పిల్లలలకు ఉన్నతోద్యోగాలొచ్చినా వాళ్లు ఓర్చుకోలేరు. మీ ముందు సంతోషంగా ఉన్నట్టు నటించినా వెనకాల ఈర్ష్య పడతారు. అంతేకాదు మీపై లేనిపోనివి కల్పించి మీ సన్నిహితులకు మీ గురించి చెడుగా చెప్పడానికి కూడా వెనకాడరు. ఇలాంటి వారికి ఎప్పుడూ ఎదుటి వారిలో లోపాలే కనిపిస్తుంటాయి. ఎప్పుడెప్పుడు వాటి గురించి ఇతరులకు చెబుదామా అని ఎదురు చూస్తుంటారు. చిన్న విషయం దొరికినా పెద్దవి చేసి ప్రచారం చేస్తుంటారు. ఇలా అనవసరమైన విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ నలుగురిలో మిమ్మల్ని నవ్వులపాలు చేయాలనుకుంటారు. ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇలాంటి వారి ప్రవర్తన గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటుంటారు కొందరు. కానీ వాళ్లను పట్టించుకోకుండా, ప్రతి విషయంలో వారిని సాధ్యమైంత దూరం పెట్టడం మంచిది. అప్పుడే వాళ్లకు మీరిచ్చే విలువేంటో అర్థం చేసుకొని మీ జీవితంలో కలగజేసుకోకుండా ఉంటారు. ఇలాంటి వారు భార్యాభర్తలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు పెట్టాలని చూస్తుంటారు. కనుక వాళ్ల మాటలు నమ్మి మీరు గొడవ పడడం కాకుండా, ఏవైనా సమస్యలొస్తే ముందు నిజానిజాలేంటో తెలుసుకోండి. కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుంది.
మరీ ముఖ్యంగా మీకు సంబంధించిన విషయాల గురించి వారు ప్రతికూలంగా స్పందించినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు నమ్మకంగా అనిపించే వ్యక్తుల సలహాలు తీసుకొని మీకు నచ్చినట్టుగా ముందుకెళ్లండి. ఇలాంటి వ్యక్తుల్ని, దూరం పెట్టడం వల్ల వారు తమకు ఎదురుతిరుగుతారేమో, తమ గురించి చెడుగా ప్రచారం చేస్తారేమోనన్న భయం కొంతమందిలో ఉంటుంది. కానీ మనసులోంచి ఆ భయాన్ని తీసేస్తే ఎక్కడా, ఎవరి ముందూ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇలా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ప్రవర్తన మారకపోయినా, పదే పదే మిమ్మల్ని ఇబ్బంది చేయాలని చూస్తే మాత్రం వారికి మీకు దూరంగా ఉండమని మోహమాటం లేకుండా చెప్పేయండి. అప్పుడే మీరు ప్రశాంతంగా ఉండగలరు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -