నవతెలంగాణ హైదరాబాద్: మహారాష్ట్రలోని పుణెలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో 10మంది మృతి చెందారు. 40 మందితో వెళుతున్న వాహనం అదుపుతప్పి 30 అడుగుల లోతులో పడిన విషయం తెలిసిందే. శ్రావణ మాసం సోమవారం సందర్భంగా పపల్వాడి గ్రామానికి చెందిన పలువురు ఖేడ్ తహసిల్ పరిధిలో ఉన్న శ్రీ క్షేత్ర మహదేవ్ కుందేశ్వర్ ఆలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో డ్రైవర్ వాహనంపై అదుపు తప్పడంతో ఒక్కసారిగా కిందపడింది.
ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రుల్లో చేర్పించారు. ఈ ఘటనలో 27 మంది గాయపడ్డారు. బాధితుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్రేషియా ప్రకటించారు.