-ఫీజులు చెల్లించక మూతపడుతున్న కాలేజీలు
- – ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రమాదంలో దాదాపుగా 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు
- – నిర్లక్ష్యం వహిస్తే విద్యార్థులతో కలిసి ఆందోళన చేపడుతాం
- – జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
నవతెలంగాణ. తాండూరురాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు తాండూరు బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి మంగళవారం ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు.
ఫీజు బకాయలు కారణంగా వేల కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు చదువును కొనసాగించలేకపోతున్నారు అని అన్నారు.కళాశాల యాజమాన్యాలు కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల ఫీజులు రాకపోవడంతో ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని తెలిపారు.ల్యాబ్‌లు, హాస్టల్‌లు, లైబ్రరీలు సరిగా నిర్వహించలేక విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 14 లక్షల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లలను చదువిస్తున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం విచారకరం అని తెలిపారు. ది ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే నవంబర్ 3వ తేదీ నుండి విద్యాసంస్థల బంద్‌కు పిలుపు ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి రూ.900 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఆలస్యం జరగకుండా శాశ్వత పద్ధతి అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించకపోతే, విద్యార్థులు, బీసీ సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రాజ్‌కుమార్ హెచ్చరించారు.



