Thursday, July 24, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివిద్వేషాల చిట్టా

విద్వేషాల చిట్టా

- Advertisement -

దేశంలో ఒక్కొక్కచోట ఒక్కొక్క విద్వేషం…ఒక్కొక్కచోట ఒక్కొక్క వివాదం…ఒక్కొక్కచోట ఒక్కొక్క విధ్వంసం…వెరసి సమైక్యతాభావం విస్మృతిలోకి జారుతున్నది. ప్రజల మధ్య సోదరాభావం, పరమత సహనాన్ని క్రమంగా కొడిగట్టించడానికి పాలకులు చేయని ప్రయత్నమంటూ లేదు. మోడీ 3.0 పాలనలో మొదటి ఏడాదిలో విద్వేష నేరాలపై అధ్యయనం చేస్తే 937 హేట్‌ క్రైమ్స్‌ తేలాయి. వీటిలో విద్వేష ప్రసంగాలదే పెద్దపీట. అందునా మైనార్టీలపై భౌతిక దాడులే అధికం. ఈ ఘటనల్లో ఎందరో ప్రాణాలు కోల్పోయారు.’హేట్‌ క్రైమ్‌ రిపోర్ట్‌: మ్యాపింగ్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఆఫ్‌ మోడీస్‌ థర్ద్‌ గవర్నమెంట్‌’ పేరిట రూపొందించిన తన అధ్యయన నివేదికలో ”పౌర హక్కుల పరిరక్షణ సమాఖ్య (ఏపీసీఆర్‌)” బట్టబయలు చేసిన లెక్కలివి.


మోడీ ప్రభుత్వంలో చెప్పుకోవటానికి ఏ ఘనతా లేక, ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పలేక, ఎన్నికల్లోకి బీజేపీ మతాన్ని లాక్కోస్తున్నది చూస్తూనే ఉన్నాము. కనీస వివేచన, విచక్షణ లేకుండా అవాకులూ చెవాకులతో ఎన్నికల ప్రచారం లోకి దిగడం ఆ పార్టీ నైజం. ”మతమనేది వ్యక్తిగతం. దాన్ని వీధుల్లోకి, విమర్శల్లోకి తీసుకురాకండి” అని దేశ సర్వోన్నత న్యాయస్థానం గతంలో గట్టిగా నిర్దేశించినా, ఎన్నికల నిబంధనావళిలో స్పష్టంగా రాసుకున్నా నాయకులకు అవి పట్టడం లేదు. సామరస్యాన్ని, సంయమనాన్ని పాటించాల్సిన ప్రధాని స్థాయి వ్యక్తి విద్వేష ప్రచారానికి ఆరంభం పలకటం మరింత దారుణం. ఏ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నా…రాముడిని రాజకీయ దినుసుగా వాడబూనటం గర్హనీయం. అసత్యాలు వల్లించడం… పచ్చి అబద్ధాలు వండి వార్చడంలో వారికి వారే సాటి.


దేశ సమగ్రతను కాపాడుతామంటూ ప్రమాణాలు చేసి ఢిల్లీ గద్దెనెక్కిన నేతలే సమాజాన్ని మెజారిటీలు… మైనార్టీలుగా చీల్చుతున్నారు. ఏకోన్ము ఖంగా.. పురోగమనం దిశగా జాతిని ప్రేరేపిం చాల్సిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు మధ్యయుగాల నాటి మత ఛాందసంలోకి దేశాన్ని దింపు తున్నారు. ఇది మన దేశ దౌర్భాగ్యం. దేశంలో అడుగడు గునా… అమలవుతున్నది ‘విభజించు- పాలించు’ నీతి. ఇది ఎందుకు చేస్తున్నారో? ఏం ఆశించి చేస్తున్నారో అన్నది బహిరంగ రహస్యమే. ఆర్థిక, సామాజిక, రాజకీయ పాలనా వైఫల్యా లను కప్పిపుచ్చు కోవడం, వాటి నుంచి జనం దృష్టిని మళ్లించి అధికారాన్ని నిలబెట్టుకో వాలన్నదే ఇందులోని కుటిల పన్నాగం.


ప్రజల దైనందిన సమస్యలను పక్కనపెట్టి, సెంటిమెంట్లతో మద్దతు కూడగట్టాలనుకోవడం క్షమార్హం కాని మోసకారితనం. మోడీ ఉద్దేశపూర్వకంగా విద్వేషాలను రెచ్చగొట్టే ధోరణిని వారి విధానంగా కొనసాగిస్తున్నారు. మోడీ పాలనలో దేశ సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ పునాదుల్ని విచ్ఛిన్నం చేసే వికృత క్రీడ రోజురోజుకు వేళ్లూనుకుంటుంది. బీజేపీ పాదుకొల్పుతున్న విభజన రాజకీయాల ప్రభావం, పర్యవసానాలు లోతుగా పరిశీలిస్తే వెన్నులో వణుకు పుట్టక మానదు. అంతా విధ్వంసమే. ఉమ్మడిగా జీవి స్తున్న జాతిలో మెజారిటీ వాదం, మైనార్టీ వాదం, మతతత్వం.. కులతత్వం.. ఏదైనా సరే ఒకసారి మొగ్గతొడితే ఆ వేరు భావనను రూపుమాపటం కష్టతరం. ఉన్మాదం తలకెక్కి వెర్రితలలు వేశాక చేసేదేం ఉండదు. అంతా హింస, అశాంతి. ఆద్యులైన వారే కాదు, నేడు చోద్యం చూసిన వారూ బలికాక తప్పదు. ఉన్మాదం అలాంటిది. చరిత్ర పుటలను తిరగేస్తే అలా కాలగర్భంలో కలిసిన జాతులు, నెత్తుటి ధారలెన్నో ఉదంతాలుగా మనకు కండ్ల ముందు తారాసపడతాయి.


తిండిపై, బట్టలపై, భాషపై ఒకటేమిటీ చెప్పుకుంటూ పోతే ప్రజల జీవితాలపై ఆంక్షల కత్తి వేలాడుతూనే ఉంది. ఆచారాలు, కట్టుబాట్లపై విద్వేషాన్ని చిమ్ముతున్నవో, మరెంతగా వాటిని అసహ్యించుకుంటున్నవో.. రేపు మిగతా మతాలు, వర్గాలపైనా అదే తరహాలో విరుచుకుపడతాయి. అందుకు ఇటీవల దేశంలో చోటుచేసుకున్న సంఘటనలే నిదర్శనం. ”ఒకవైపు దేశమేమో మతాలుగా కులాలుగా ముక్కలవుతోంది… మరోవైపు పెట్టుబడేమో సంపదగా, దోపిడీగా ఏకమవుతోంది… మన నాయకుడేమో ప్రజలను వంచిస్తూ, పెట్టుబడికి ఊడిగం చేస్తూ బలపడుతున్నాడు..” అంటాడో ప్రజాకవి. ఈ కవి వాక్కులు ఎంత అక్షర సత్యాలో చెప్పడానికి ఇంతకన్నా నిదర్మనం ఏం కావాలి?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -