కరీంనగర్‌లో భారీ ‘మ్యూల్ అకౌంట్ల’ ముఠా గుట్టురట్టు!
ఆర్‌బీఎల్ బ్యాంక్ మేనేజర్ సహా 13 మంది అరెస్ట్
విదేశాలకు భారీగా సొమ్ము మళ్లింపు
మీడియాకు కీలక వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం
కరీంనగర్ పోలీసుల ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0’ సక్సెస్
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కమీషన్ల ఆశ చూపి సామాన్యుల పేర్లతో బ్యాంక్ అకౌంట్లు తెరిపించడం.. ఆపై ఆ ఖాతాల ద్వారా సైబర్ మోసాల సొమ్మును విదేశాలకు మళ్లించి భారీ కుంభకోణానికి తెరలేపారు. ఈ ఘరానా మ్యూల్ అకౌంట్ల నెట్‌వర్క్‌పై కరీంనగర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్(ఆర్‌బీఎల్) మేనేజర్ సహకారంతో ఏకంగా రూ.138 కోట్ల అక్రమ లావాదేవీలు సాగించిన సైబర్ క్రైమ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరాలకు కేంద్ర బిందువుగా మారుతున్న ‘మ్యూల్ బ్యాంక్ ఖాతాల’పై కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కొరడా ఝలిపించింది. శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన విస్తుపోయే నిజాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడే ముఠాలకు సహకరిస్తున్న స్థానిక నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు పోలీసులు ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0’ను ప్రారంభించారు. ఈ దర్యాప్తులో మొత్తం 24 మంది నిందితులను గుర్తించగా, వారిలో 13 మందిని శనివారం రిమాండ్‌కు తరలించారు.
కంచే చేను మేసిన వైనం..
ఈ కేసులో అత్యంత విస్మయకరమైన విషయం ఏమిటంటే.. ప్రజల సొమ్ముకు రక్షణ కల్పించాల్సిన బ్యాంకు అధికారులే నేరస్థులతో కుమ్మక్కయ్యారు. హన్మకొండకు చెందిన ఆర్‌బీఎల్ బ్యాంక్ మేనేజర్ భువనగిరి కళ్యాణ్, కరీంనగర్‌కు చెందిన మరో బ్యాంక్ ఉద్యోగిని అయేషా బేగం నేరుగా ఈ ముఠాకు సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. నిందితులు మూడు అంచెలుగా ఈ సైబర్ దందాను నడిపిస్తున్నారు. కొందరు సమన్వయకర్తలు మ్యూల్ ఖాతాల ఏర్పాటును దగ్గరుండి పర్యవేక్షిస్తారు. మధ్యవర్తులు సామాన్య ప్రజలను టార్గెట్ చేసి, వారికి కొంత కమీషన్ ఆశ చూపి బ్యాంక్ ఖాతాలు తెరిపిస్తారు. ఖాతాదారులు కొద్దిపాటి డబ్బు కోసం ఆశపడి తమ వ్యక్తిగత ఖాతాలను, లాగిన్ వివరాలను నేరగాళ్లకు అప్పగిస్తారు. ఈ విధంగా సేకరించిన ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు తాము మోసగించిన డబ్బును విదేశాలకు సులువుగా మళ్లించేవారని సీపీ గౌస్ ఆలం వివరించారు.
రూ.138 కోట్ల లావాదేవీలు.. 8 కేసులు నమోదు
పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ ముఠా చేసిన ఆర్థిక లావాదేవీల గణాంకాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. వర్చువల్ ఖాతాల ద్వారా రూ.12,25,31,665, అలాగే బ్యాంక్ మ్యూల్ ఖాతాల ద్వారా రూ. 125,80,71,688.. మొత్తంగా సుమారు రూ.138 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఈ వ్యవహారంపై భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్లు 112, 318(4), ఐటీ యాక్ట్ సెక్షన్ 66-డీ కింద మొత్తం 8 కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ముఖ్య నిందితులు (సమన్వయకర్తలు/మధ్యవర్తులు) బండారి సాయిరాం (వెల్గటూర్, జగిత్యాలజిల్లా), అనుమాండ్ల రంజిత్ (బుగ్గారం, జగిత్యాల జిల్లా), అలిగేటి మల్లేశం (ధర్మారం, పెద్దపల్లి జిల్లా, బోగ రాకేష్ (జగిత్యాల జిల్లా), బండి ప్రణయ్ (రామడుగు, కరీంనగర్ జిల్లా), ఈ నేరానికి సహకరించిన బ్యాంకు అధికారులు హన్మకొండకు చెందిన ఆర్‌బీఎల్ బ్యాంకు మేనేజర్ భువనగిరి కళ్యాణ్‌ను రిమాండ్‌కు తరలించారు. ఇందులో బ్యాంక్ ఉద్యోగి అయేషా బేగం నాలుగు నెలల గర్భవతి కావడంతో ఆమెను ఆరెస్టు చేయలేదు.
కమీషన్లకు కక్కుర్తిపడి ఖాతా వివరాలివ్వొద్దు.. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం
కొద్దిపాటి కమీషన్లకు ఆశపడి మీ బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం కార్డులు లేదా లాగిన్ వివరాలను గుర్తుతెలియని వ్యక్తులకు ఇవ్వకండి. ఇతరుల కోసం మీ పేరుతో అకౌంట్లు తెరిస్తే, ఆ ఖాతాల్లో జరిగే సైబర్ నేరాలకు చట్టప్రకారం మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. జైలుకు వెళ్లక తప్పదు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకా పలువురిని అరెస్టు చేయాల్సి ఉంది. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930 టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. లేదా www.cybercrime.gov.in, https://www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి.



