– తమిళనాడుకు చెందిన వ్యాపారుల బురిడీ
నవతెలంగాణ-గంగాధర : చీరల కొనుగోలు పేరిట వస్త్రోత్పతి వ్యాపారులకు ఓ వ్యాపారి కోటి 50 లక్షల రూపాయలకు టోకరా వేసి ఉడాయించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధిత వస్త్ర వ్యాపారుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో ఆపిల్ టెక్సుటైల్స్ హోల్ సెల్ డీలర్స్ పేరిట తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లా పెరుగోపానపల్లి చెందిన వినోద్ రాజ్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి 8 నెలల క్రితం ఓ కార్యాలయాన్ని తెరిచారు.
ఇక్కడే ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని నివాసం ఉంటూ స్థానిక వస్త్రోత్పత్తి వ్యాపారుల వద్ద గోసి చీరలు, కొత్తపల్లి మున్సిపల్ టౌన్ కు చెంది కొందరి వద్ద లక్షల రూపాయల విలువ చేసే టవాల్స్, దస్తీలు, రెడీమేడ్ దుస్తులు కొనుగోలు చేశారు. తొలుత స్థానిక వ్యాపాలకు నమ్మకం కలిగించడానికి మెుదలు కొనుగోలు చేసిన గోసి చీరలు, టవాల్స్, దస్తీలు, రెడీమేడ్ దుస్తులకు కొంత ఉద్దెర పెట్టి కొంత మెుత్తం నగదును పేమెంట్ చేశారు. ఇలా గత 8 నెలల కాలంలో వినోద్ రాజ్ గ్యాంగ్ కోట్ల రూపాయల టర్నవర్ చేసింది. అయితే బకాయిలు పేరుకుపోవడంతో చీరలు, టవాల్స్, దస్తీలు, రెడీమేడ్ దుస్తులు అందించిన వస్త్రోత్పత్తి వ్యాపాలు పేమెంట్ కోసం వినోద్ రాజ్ గ్యాంగ్ పై ఒత్తిడి పెంచారు.
దీంతో తమ బోగస్ దందా బాగోతం బయట పడతదని గ్రహించిన వినోద్ రాజ్ గ్యాంగ్ నమ్మిన వస్త్రోత్పత్తి వ్యాపాల వద్ద లక్షలు విలువ చేసే మరిన్ని చీరలు, టవాల్స్, దస్తీలు, రెడీమేడ్ దుస్తులు గట్టాలుగా చేసుకుని ఈ నెల 16 వ తేదీన బోలెరో వాహనంలో వేసుకుని తెరిచిన ఆఫీసుకు తాళం వేసి పత్తాలేకుండా పరార్ అయ్యారు. దీంతో వస్త్ర ఉత్పత్తులు కొనుగోలు చేసిన వినోద్ రాజ్ సెల్ కు కాల్ చేయగా, స్విచ్డ్ ఆప్ వస్తున్నట్టు వస్త్రోత్పత్తి వ్యాపారులు గుర్తించారు. గర్శకుర్తి గ్రామానికి చెందిన పది మంది వస్త్రోత్పత్తి వ్యాపారుల నుండే సుమారు కోటి రూపాయల చీరలు, దస్తీలు, టవాల్స్, రెడీమేడ్ దుస్తులు కొనుగోలు చేసి టోకరా వేసినట్టు బాధిత వ్యాపారులు లబోదిబోమంటున్నారు.
అయితే కేవలం గర్శకుర్తి వస్త్రోత్పత్తి వ్యాపారులనే కాకుండా ఘరాన గ్యాంగ్ కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, కొత్తపల్లి మున్సిపల్ టౌన్, జూబ్లీ, సావనపెల్లితోపాటు పలు గ్రామాల్లో చీరలు, దస్తీలు, టవాల్స్ కొనుగోలు చేసి ఇక్కడి వ్యాపారులకు కూడా మరో 50 లక్షల రూపాయలకు టోకరా వేసి ఉడాయించినట్టు బాధిత వ్యాపారులు ఠాణా మెట్లు ఎక్కారు. వస్త్ర వ్యాపారుల పేరిట ఘరాన మెాసానికి పాల్పడి కోటీ 50 లక్షల పైగా టోకరా వేసి పరార్ అయిన వినోద్ రాజ్ గ్యాంగ్ పై గంగాధర ఠాణాలో గర్శకుర్తి, కొత్తపల్లి గ్రామాల బాధిత వ్యాపారులు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్సై వంశీకృష్ణను ప్రశ్నించగా బాధిత వస్త్రోత్పత్తి వ్యాపారులు ఫిర్యాదు చేసిన మాట నిజమేనన్నారు. బాధితులు చేసిన ఫిర్యాదును అనుసరించి సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని వివరించారు.