Saturday, December 13, 2025
E-PAPER
Homeజాతీయంబీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐ

బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐ

- Advertisement -

అణుశక్తిలో ప్రయివేటు పెట్టుబడులు
జనగణనకు రూ.11,718 కోట్లు
ఉపాధి హామీ పేరు మార్పు : కేంద్ర మంత్రివర్గం ఆమోదం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని వంద శాతం పెంచే నిబంధనతో సహా బీమా చట్టం, ఎల్‌ఐసీ చట్టం, ఐఆర్‌డీఏఐ చట్టాల సవరణ బిల్లుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. సోమవారం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. శుక్రవారం ప్రధాని మోడీ అధ్యక్షత కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు.

కేంద్ర మంత్రివర్గం అణుశక్తి చట్టాలలో మార్పులను ఆమోదించింది. అణు ఖనిజాల అన్వేషణ, ఇంధన తయారీ, పరికరాల తయారీ, ప్లాంట్‌ కార్యకలాపాల అంశాలలో ప్రయివేట్‌ పెట్టుబడులను అనుమతిస్తారు. దీనికి ఉద్దేశించిన బిల్లు అణుశక్తి శాఖ (డీఏఈ) కాకుండా, ప్రయివేట్‌ భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు విదేశీ సాంకేతిక సరఫరాదారులను ఆకర్షించడం వంటివి చేస్తోంది. కాలం చెల్లిన 71 చట్టాలను రద్దు చేసే బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బ్రిటిష్‌ కాలం నాటి 71 చట్టాలలో 65 ప్రధాన చట్టాలకు సవరణలు, ఆరు ప్రధాన చట్టాలు రద్దు చేయడానికి ప్రతిపాదిస్తూ ఒక బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

జనగణనకు..
జనగణన కోసం కేటాయించిన రూ.11,718.24 కోట్ల బడ్జెట్‌కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. 2027లో రెండు విడతల్లో జనగణన జరగనుంది. అయితే ఈసారి డిజిటల్‌ టెక్నాలజీని ఉపయోగించి జనగణన చేపట్టనున్నారు. అందుకోసం ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లో మొబైల్‌ అప్లికేషన్‌లతో డేటా సేకరణ ఉంటుంది. 2026 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ 6 వరకు గ ృహాలను జాబితా చేస్తామని, 2027 ఫిబ్రవరి నుంచి జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని అన్నారు. దాదాపు 550 రోజుల పాటు దాదాపు 18,600 మంది సాంకేతిక సిబ్బందిని నియమిస్తారని, అంటే దాదాపు 1.02 కోట్ల పని దినాల ఉపాధి కల్పన జరుగుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్‌ యోజన’గా మార్పు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరు మార్చడానికి, పని దినాల సంఖ్యను పెంచడానికి ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని ఇప్పుడు ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్‌ యోజన’గా పేరు మార్చనున్నారు. పని దినాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచనున్నారు.

ఒకే సంస్థ కింద ఉన్నత విద్యా రంగం
యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈల స్థానంలో ఒకే ఉన్నత విద్యా నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసే బిల్లుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. గతంలో భారత ఉన్నత విద్యా కమిషన్‌ (హెచ్‌ఈసీఐ) బిల్లుగా పిలువబడే ప్రతిపాదిత చట్టానికి ఇప్పుడు విక్షిత్‌ భారత్‌ శిక్షా అధికారం బిల్లు అని పేరు పెట్టారు. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో ప్రతిపాదించిన ఏకైక ఉన్నత విద్యా నియంత్రణ సంస్థలో భాగంగా ఈ బిల్లు తీసుకొచ్చారు.

బొగ్గు గనుల్లో సంస్కరణలు
బొగ్గు గనుల్లో సంస్కరణలకు కూడా కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. వేలం ద్వారా సేకరించిన బొగ్గును వివిధ పారిశ్రామిక ఉపయోగాలు, ఎగుమతుల కోసం అనుమతించే ‘కోల్‌సేటు’ విండో విధానాన్ని ఆమోదించింది. ప్రస్తుత విధానం వేలం ద్వారా సిమెంట్‌, ఉక్కు, స్పాంజ్‌, ఇనుము, అల్యూమినియం మొదలైన వాటికి మాత్రమే ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది. ఇప్పుడు 50 శాతం వరకు ఎగుమతి చేసుకోవచ్చు.

కొబ్బరి మిల్లింగ్‌కు ఎంఎస్‌పీ
2026 సీజన్‌కు కొబ్బరి మిల్లింగ్‌ కనీస మద్దతు ధరకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్వింటాలుకు రూ.445 వరకు పెంచింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బాల్‌ కొబ్బరి ఎంఎస్‌పీని క్వింటాలుకు రూ.400 పెంచి రూ.12,500కు పెంచినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -