– ఆందోళనలో డిస్ట్రిబ్యూటర్లు
– ఓవర్సీస్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం
– తెలుగు సినిమాలకూ టారిఫ్ సెగ
విదేశీ ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కన్ను ఇప్పుడు ఇతర దేశాలలో నిర్మించిన సినిమాలపై పడింది. విదేశీ భూభాగంపై నిర్మించే సినిమాలపై వంద శాతం సుంకం విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
ఈ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేసే అధికారాన్ని అమెరికా వాణిజ్య శాఖకు, వాణిజ్య ప్రతినిధులకు అప్పగించారు. అయితే తన నిర్ణయాన్ని ఎలా అమలు చేస్తారో ఆయన వివరించలేదు.
‘ఇతర దేశాలు మన నిర్మాతలను, స్టూడియోలను అమెరికా నుండి దూరం చేయడానికి అనేక రాయితీలు అందజేస్తున్నాయి. దీనివల్ల అమెరికాలోని హాలీవుడ్, అనేక ఇతర ప్రాంతాలు నాశనమై పోతున్నాయి. అన్ని దేశాలు కలిసి సమిష్టిగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి ఇది దేశ భద్రతకు ముప్పు’ అని ట్రంప్ తెలిపారు.
అమెరికా, చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం సెగలు ఇప్పటికే హాలీవుడ్‌ను తాకాయి. దేశంలోకి అనుమతించే అమెరికా చిత్రాల కోటాను కుదించాలని చైనా నిర్ణయించింది.
సినీ మార్కెట్‌లో సుంకాల యుద్ధం జరిగితే పశ్చిమ దేశాల స్డూడియోలపై ప్రభావం పడుతుంది. ప్రధానంగా వాల్ట్ డిస్నీ కంపెనీ, పారమౌంట్ గ్లోబల్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ వంటివి నష్టపోతాయి.
‘చైనాపై అధిక సుంకాలు విధించాలని ట్రంప్ తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా అమెరికా సినిమాలపై మా ప్రేక్షకులకు ఉన్న సానుకూలత బాగా తగ్గిపోతుంది’ అని చైనా ఫిల్మ్ అడ్మినిస్ట్రేషన్ గత నెల 10వ తేదీన ఒక ప్రకటనలో తెలియజేసింది. సినిమాలకు అమెరికా తర్వాత చైనాయే అతి పెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది. అయితే ఇటీవలి కాలంలో చైనా సినిమాలు హాలీవుడ్ దిగుమతులను అధిగ మించాయి. ట్రంప్ టారిఫ్‌తో పంపిణీదారులు ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే తెలుగు, హిందీ, తమిళ, మలయాళ సినిమాలకు అమెరికాలో మంచి మార్కెట్, క్రేజ్ ఉంటుంది. పెద్ద హీరోల చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. సినిమాలకు అక్కడ మంచి ఓపెనింగ్స్ వస్తాయి. వందశాతం టారిఫ్ వల్ల మన సినిమాల కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని ద్వారా అటు నిర్మాతలు, ఇటు పంపిణీదారులు సైతం భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ట్రంప్ చర్య భారతీయ సినిమాకు పెద్ద దెబ్బే అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
విదేశీ చలన చిత్రాలపై వంద శాతం పన్ను
- Advertisement -
- Advertisement -