Saturday, October 11, 2025
E-PAPER
Homeజాతీయంఓటరు గుర్తింపునకు 12 పత్రాలు

ఓటరు గుర్తింపునకు 12 పత్రాలు

- Advertisement -

బీహార్‌ ఎన్నికలపై ఈసీ
ముస్లిం మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

న్యూఢిల్లీ : బీహార్‌ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల గుర్తింపునకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌ శుక్రవారం సవివరమైన ఆదేశాలు జారీ చేసింది. బురఖా, పరదా ధరించే మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘బురఖా, పరదా ధరించే మహిళలు ఎన్నికల్లో ఓటు వేసేలా ప్రోత్సహించడానికి పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాము. వారి గోప్యతను పరిరక్షించేలా మహిళా పోలీస్‌ అధికారులు లేదా అటెండెంట్ల సమక్షంలో గుర్తింపును పరిశీలించడం జరుగుతుంది’ అని ఆ ప్రకటనలో వివరించారు. బీహార్‌ లోని ఓటర్లకు, అలాగే ఉప ఎన్నికలు జరిగే ఎనిమిది నియోజకవర్గాల ఓటర్లకు దాదాపుగా నూరు శాతం ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేశామని తెలిపారు. ఓటరు జాబితాల తుది ప్రచురణ జరిగిన పదిహేను రోజుల్లో కొత్త ఓటర్లకు ఎపిక్‌ కార్డులు అందజేయాల్సిందిగా సీఈఓకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.

ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులు ఇవే
పోలింగ్‌ కేంద్రంలో ఎపిక్‌ కార్డు చూపలేని ఓటర్లు ప్రత్యామ్నాయంగా 12 ఫొటో గుర్తింపు కార్డులు చూపించి ఓటు వేయవచ్చు. వీటిలో ఆధార్‌, ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డులు, ఫొటోతో కూడిన బ్యాంక్‌ లేదా పోస్టాఫీస్‌ పాస్‌ పుస్తకాలు, ఆరోగ్య బీమా స్మార్ట్‌ కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సులు, పాన్‌ కార్డులు, భారతీయ పాస్‌పోర్టులు, ఫొటోలతో కూడిన పెన్షన్‌ పత్రాలు, ప్రభుత్వ సర్వీసు గుర్తింపు కార్డులు, అధికారిక ఎంపీ/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ ఐడీలు, దివ్యాంగ ఐడీ కార్డులు ఉన్నాయి.

రాజకీయ చర్చ నేపథ్యంలోనే…
ఓటరు పరిశీలనపై గత వారంలో రాజకీయ చర్చ జరిగిన నేపథ్యంలో సీఈసీ ఈ ప్రకటన విడుదల చేసింది. బీజేపీ బీహార్‌ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ జైస్వాల్‌ ప్రత్యేకించి బురఖా ధరించే మహిళలను ప్రస్తావిస్తూ పరిశీలన సరిగా జరిగేలా చూడాలని కోరారు. బురఖా, పరదా ధరించే మహిళల ముఖాలను గుర్తింపు కార్డుతో పోల్చాలని సూచించారు. దీనివల్ల నిజమైన ఓటర్లు ఓటేసేం దుకు అవకాశం ఉంటుందని తెలిపారు. బలహీన వర్గాల సంఖ్య తక్కువగా ఉండే గ్రామాల్లో ఓటర్లను పోలింగ్‌ సమయంలో ఎవరూ భయపెట్టకుండా చూడడానికి పారా మిలటరీ దళాలను మోహరించాలని కూడా విజ్ఞప్తి చేశారు.

జైస్వాల్‌ సూచనపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ ప్రతిపాదన రాజకీయ కుట్ర అని ఆర్జేడీ ఆరోపించింది. ‘ఇటీవలే సర్‌ ప్రక్రియ జరిగింది. ఓటర్లందరికీ కొత్త ఫొటోలతో గుర్తింపు కార్డులు జారీ చేశారు. కాబట్టి ఓటర్ల గుర్తింపు పెద్ద విషయమేమీ కాదు. కానీ బీజేపీ తన అజెండాను ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటోంది’ అని ఆర్జేడీ నేత అభయ్ కుష్వాహా మండిపడ్డారు. ఓటర్ల తుది జాబితాల నుంచి తొలగించిన 3.66 లక్షల పేర్లను వెల్లడించాలని కూడా ఆర్జేడీ డిమాండ్‌ చేసింది. బడ్జెటరీ కేటాయింపులతో నిమిత్తం లేకుండా జనాకర్షక ప్రకటనలు చేస్తున్న ఎన్డీఏను నిలువరించాలని, ఎన్నికల ప్రచార సమయంలో వ్యక్తిగత దాడులు జరగకుండా అడ్డుకోవాలని కూడా కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -