Friday, October 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉప ఎన్నికకు నాలుగో రోజు19 నామినేషన్లు

ఉప ఎన్నికకు నాలుగో రోజు19 నామినేషన్లు

- Advertisement -

21వరకు నామినేషన్ల స్వీకరణ, 22న పరిశీలన
ఫిర్యాదులకు హెల్ప్‌లైన్‌
అధికారుల తనిఖీలు

నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. గురువారం నాలుగోరోజు 19మంది అభ్యర్థులు 21 నామినేషన్లు వేశారు. సోమవారం నోటిఫికేషన్‌ విడుదల కావడంతో మొదటి రోజు 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. రెండోరోజు 10మంది అభ్యర్థుల నుంచి 11నామినేషన్లు దాఖలయ్యాయి. మూడోరోజు మరో 12మంది 13నామినేషన్లను దాఖలు చేశారు. నాలుగోరోజు 19 మంది అభ్యర్థుల నుంచి 21నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లకు 21వరకు స్వీకరించనున్నారు.

ఆ తర్వాత 22న నామినేషన్లను పరిశీలన చేస్తారు. నామినేషన్లు ఉపసంహరణకు ఈ నెల 24వరకు సమయం ఉండడంతో పెద్దమొత్తంలో నామినేషన్లు వచ్చే అవకాశముందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఇదిలావుండగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో 407 పోలింగ్‌ కేంద్రాల కోసం మొత్తం 569 బ్యాలెట్‌ యూనిట్లు, 569 కంట్రోల్‌ యూనిట్లు, 610 వీవీప్యాట్‌లు కేటాయించారు. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ నేతృత్వంలో ఈవీఏంల మొదటి రాండమైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓటర్లు సౌకర్యవంతంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వసతులు అక్కడ అధికారులను ఆదేశించారు.

భారీ భద్రత.. ముమ్మరంగా తనిఖీలు
జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, మద్యం, నగదును తరలిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఎన్నికల పర్యవేక్షణ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బందాలు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో రూ.10 లక్షలకుపైగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం సైతం జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన ఫ్లయింగ్‌స్క్వాడ్స్‌ మరో రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నాయి.

ఫిర్యాదులు, సమాచారం కోసం అందుబాటులోకి హెల్ప్‌లైన్‌
ఉపఎన్నికల నేపథ్యంలో, ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక 1950 హెల్ప్‌లైన్‌, జాతీయ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (ఎన్‌జీఆర్‌ఎస్‌) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నవంబర్‌ 11న పోలింగ్‌ జరగనుండడంతో ప్రజలను ప్రలోభాలకు గురిచేసిన, ఇతర సమస్యలు తలెత్తినా 1950 హెల్ప్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చును. దాంతోపాటు ఓటర్ల జాబితా, పోలింగ్‌ సెంటర్లు, ఎపిక్‌ కార్డులు, మోడల్‌ కోడ్‌ ఉల్లంఘనలు, ప్రలోభాల అంశాలు మొదలైన వాటికి సంబంధించిన సమాచారం పొందడమే కాకుండా, ఫిర్యాదులు నమోదు చేయొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -