పార్లమెంటుకు తెలియజేసిన ప్రభుత్వం
న్యూఢిల్లీ : 2020 నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ వరకూ గడచిన ఐదు సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా 2,49,28,536 రేషన్ కార్డులను రద్దు చేయడం జరిగిందని కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలియజేసింది. 2022లో అత్యధిక సంఖ్యలో కార్డులు రద్దయ్యాయని చెప్పింది. లోక్‌సభలో పి.కార్తీ చిదంబరం అడిగిన ప్రశ్నకు వినియోగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిముంబెన్ బంభానియా ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. లబ్దిదారుల గుర్తింపు, వారి జాబితాల నిర్వహణ వంటి పనులను సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే చూసుకుంటాయని ఆమె తెలిపారు.
ఈ నెల 10వ తేదీ నాటికి దేశంలో 20,29,52,938 రేషన్ కార్డులు మనుగడలో ఉన్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్ అత్యధిక కార్డులు జారీ చేయగా బీహార్, మహారాష్ట్ర తర్వాతి స్థానాలలో నిలిచాయి.డూప్లికేట్ లేదా అనర్హులైన లబ్దిదారులు ఉండడం, ఈ-కేవైసీ మ్యాచ్ కాకపోవడం, మరణాలు, కుటుంబాల శాశ్వత వలసలు వంటి కారణాలతో రేషన్ కార్డులను రద్దు చేయడం జరిగిందని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమాచారం ఇచ్చాయని మంత్రి చెప్పారు. ఈ-కేవైసీ పూర్తి చేయకపోవడం, ఆధార్ ధృవీకరణ లేకపోవడం వల్ల ఏ ఒక్క కార్డు రద్దు కాలేదని ఆమె తెలిపారు. రేషన్ కార్డులను అన్యాయంగా రద్దు చేశారంటూ నివేదికలు కానీ ఫిర్యాదులు కానీ రాలేదని ఆమె తన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.



