‘బెలూన్ టెక్నాలజీ’ ద్వారా తొలగింపునకు ఏర్పాట్లు
వదోదరా : గుజరాత్‌లోని వదోదరలోని ముజ్‌పూర్-గంభీర వంతెన కూలి 25 రోజులు గడిచినా ఆ వంతెనపై ట్యాంకర్ వేలాడుతూనే ఉంది. దీనిపై మీడియాలో కథనాలు వెలువడడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సూచనల మేరకు ట్యాంకర్‌ను తొలగించే చర్యలకు పూనుకున్నారు. అత్యాధునిక ‘బెలూన్ టెక్నాలజీ’ని ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు. కాగా , జులై 9న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 21 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే నేటికీ క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు.
విరిగిన వంతెన నుంచి ట్యాంకర్‌ను ఎలా తొలగిస్తారు..?
వంతెన నిర్మాణం చాలా బలహీనంగా మారింది. ఈ ప్రక్రియలో భారీ యంత్రాలను ఉపయోగించలేమని ఎంఎస్ విశ్వవిద్యాలయం మెకానికల్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ నికుల్ పటేల్ తెలిపారు. బెలూన్ టెక్నాలజీ కింద.. ట్యాంకర్‌ను గాలిలోకి ఎత్తి, ప్రొపేన్ గ్యాస్‌తో నింపిన బెలూన్ సహాయంతో స్థిరీకరించాక.. సురక్షితంగా తొలగిస్తామని వివరించారు. ఈ టెక్నాలజీలో ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్, బయో-ఎండ్ ఫోర్స్ యొక్క శాస్త్రీయ ఉపయోగం జరుగుతుం దని కూడా ఆయన చెప్పారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా నిరోధించడానికి ఈ ఆపరేషన్‌ను డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తారు.
మెరైన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌్ కంపెనీకి బాధ్యత
ట్యాంకర్‌ను తొలగించే బాధ్యతను విశ్వకర్మ గ్రూప్ ఆఫ్ పోర్బందర్‌కు చెందిన మెరైన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ కంపెనీకి అప్పగించినట్టు వదోదర పరిపాలన అధికారులు తెలిపారు. ఈ కంపెనీ దేశంలోని ఏకైక మెరైన్ రెస్క్యూ ఏజెన్సీ. ప్రభుత్వ మార్గదర్శకత్వంలో ఈ పని చేయనున్నట్టు వివరించారు. సర్వే , రీడింగ్ పనులు రాబోయే నాలుగైదు రోజుల్లో పూర్తవుతాయని కలెక్టర్ ప్రవీణ్ చౌదరి తెలియజేశారు. ఆ తర్వాత ఏడు రోజుల్లో బెలూన్ టెక్నాలజీతో ట్యాంకర్‌ను తొలగిస్తారు. అయితే ఈ ఆపరేషన్ ఎలా చేస్తారన్న దానిపై చర్చ నడుస్తోంది.
ముజ్‌పూర్-గంభీర వంతెన కూలి 25 రోజులు గడిచినా.. ఇంకా వేలాడుతూనే ఉన్న ట్యాంకర్
- Advertisement -
- Advertisement -