Tuesday, November 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఐదేండ్లలో 300మంది మృతి

ఐదేండ్లలో 300మంది మృతి

- Advertisement -

ఆలస్యం నింపిన విషాదం
అప్పా నుంచి మన్నెగూడ వరకు నేషనల్‌ హైవే పనుల్లో జాప్యం
బీజేపీ ఎంపీ ఉన్నా పట్టించుకోని వైనం
నేతల మధ్య విభేదాలతో గత ప్రభుత్వంలోనూ ముందుకు సాగని పనులు..
పర్యావరణం పేరుతో కాలయాపన…తరుచూ ప్రమాదాలు
ఇటీవల కేసు విత్‌ డ్రా చేసుకున్న పర్యావరణ వేత్తలు
ఇప్పటికైనా పనులు త్వరగా ప్రారంభించాలని ప్రజల వేడుకోలు
సీఎం ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి

నవతెలంగాణ-చేవెళ్ల
ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం సామాన్యుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఎప్పుడో చేపట్టాల్సిన హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారి పనులు వివిధ కారణాలతో నిలిచిపోయాయి. స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే అప్ప నుంచి మన్నెగూడ వరకు నేషనల్‌ హైవే పనుల్లో జాప్యం జరుగుతూ వచ్చింది. ఎన్నికల హామీలో ఈ రోడ్డును అస్త్రంగా చేసుకున్న నాయకులు గెలిచిన తర్వాత.. పట్టించుకున్న పాపానపోలేదు. బీజేపీ ఎంపీ ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శలు ఉన్నాయి.

పనులకు శంకుస్థాపన చేసినప్పుడు జాతీయ రహదారి పనులకు పర్యావరణం పేరుతో కాలయాపన చేయడం పట్ల ప్రజలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ పనులు ముందుకు సాగలేదు. నేతల మధ్య విభేదాలతో ఎంతోమంది ప్రాణాలు పొగొట్టుకోవాల్సి వస్తోంది. అందుకే నేతలపై జనం తిరగబడ్డారు. ఈ రోడ్డు వెంట నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. వివిధ ప్రమాదాల్లో ఇప్పటి వరకు 300 మందికి పైగా చనిపోయారంటే.. ఈ రోడ్డు ఎంత ప్రమాదకరమైనదో తెలుస్తోంది. ఇటీవల ఈ రోడ్డుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని రోడ్డు పనులు పూర్తి చేసి ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

జరిగిన ప్రమాదాలు..
హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారి రోడ్డు ఇరుకుగా ఉండటంతో గత ఐదేండ్లలో చాలా ప్రమాదాలు జరిగాయి. ఇందులో 300 మంది మృతిచెందగా, మరో 600మందికి పైగా గాయాలపాలైనట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్‌-వికారాబాద్‌ ప్రధాన రహదారి కావడంతో రోజూ వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. అయితే ఇది సింగిల్‌ రోడ్డు కావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. దీనికితోడు చాలా చోట్ల మూల మలుపులు ఉన్నాయి. వర్షాలు పడినప్పుడు రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయి. ఇలా రోడ్డు మొత్తం అస్తవ్యస్తంగా ఉండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు స్పందించే ప్రజాప్రతినిధులు ఆ తరువాత పట్టించుకోకపో వడంతో ఏండ్లుగా ఈ రోడ్డు పనులు ముందుకు సాగడం లేదు.

భూసేకరణ పూర్తి
స్టేట్‌ హైవేగా ఉన్న హైదరాబాద్‌-బీజాపూర్‌ రోడ్డును కేంద్రం 2018లో ఎన్‌హెచ్‌163గా అప్‌గ్రేడ్‌ చేసింది. అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ మేర రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించాలని నిర్ణయించి.. రూ.928.41 కోట్లు మంజూరు చేసింది. దారి పొడవునా 18 అండర్‌ పాసులు, మొయినాబాద్‌ సమీపంలో 4.35 కి.మీ, చేవెళ్ల సమీపంలో 6.36 కి.మీ. మేర బైపాస్‌లు నిర్మించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు 29 ఏప్రిల్‌ 2022లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. టెండర్‌ ప్రాసెస్‌ కూడా పూర్తి కావడంతో పనులు చేపట్టిన అధికారులు 143 హెక్టార్ల భూసేకరణ చేసి.. రైతులకు రూ.200 కోట్ల పరిహారం కూడా చెల్లించారు.

అయితే దారికి ఇరువైపులా 915 మర్రి చెట్లు ఉండటంతో వాటిని తొలగించవద్దని సేవ్‌ బనియన్స్‌ స్వచ్ఛంద సంస్థకు చెందిన వ్యక్తులు ఎన్జీటీలో కేసు వేయడంతో పనులు ఆగిపోయాయి. బైపాసులు, రోడ్డు సెంట్రల్‌ మీడియన్‌ను తగ్గించడం ద్వారా 393 కాపాడుతామని, 522 చెట్లు ట్రాన్స్‌ లొకేట్‌ చేస్తామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఎన్జీటీకి విన్నవించినా ఒప్పుకోలేదు. కేసులో ఇరువురి వాదనలు విన్న కోర్టు మార్చి 25న పనులపై స్టే విధిస్తూ తీర్పు ఇచ్చింది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని, ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ (ఈఐఏ), జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జడ్‌ఎస్‌ఐ) రిపోర్టు సబ్మిట్‌ చేయాలని ఆదేశించింది.

పర్యావరణ వేత్తలతో చర్చలు సఫలం
సీఎం రేవంత్‌ రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ సొంత నియోజకవర్గాలకు వెళ్లే రోడ్డు ఇదే కావడం, మరో వైపు ఈ దారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతుండటంతో ఈ సమస్యను వారు సీరియస్‌గా తీసుకున్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల సమక్షంలో ‘సేవ్‌ బనియన్స్‌’ సంస్థకు చెందిన పర్యావరణవేత్తలతో పలుమార్లు చర్చలు జరిపారు. 765 చెట్లు కాపాడుతామని, 135 చెట్లు మాత్రమే రీ లొకేట్‌ చేస్తామని హామీ ఇవ్వడంతో వాళ్లు కేసు విత్‌ డ్రా చేసుకున్నారు.

పనులు దక్కించుకున్న మెఘా ఇంజనీరింగ్‌ సంస్థ..
హైదరాబాద్‌-బీజాపూర్‌ రోడ్డు (ఎన్‌హెచ్‌-163) అప్పా జంక్షన్‌ నుంచి మన్నేగూడ వరకు 4 లైన్ల రోడ్డు నిర్మించాల్సి ఉంది. 46కి.మీ పొడవు, రూ.928.41కోట్లతో చేపడుతున్న ఈ పనుల కాంట్రాక్టును మెఘా ఇంజనీరింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ దక్కించుకుంది. రోడ్డు పనుల కోసం 145.42 హెక్టార్లు సేకరించాల్సి ఉండగా వంద శాతం పూర్తి చేశారు. భూమి కోల్పోయిన రైతులకు భూ పరిహారం వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.

సీఎం చొరవ తీసుకొని పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
సీఎం రేవంత్‌ రెడ్డి చొరవ తీసుకొని ఈ ప్రాంత ప్రజలను కాపాడాలని పలువురు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు పోయాయని ఇక ఎవరి ప్రాణాలు పోవద్దంటే వాటిని రోడ్డు పనులను తొందరగా పూర్తి చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -