Friday, October 31, 2025
E-PAPER
Homeఆటలు338 ఉఫ్‌

338 ఉఫ్‌

- Advertisement -

ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ అడుగు
సెమీఫైనల్లో ఆసీస్‌పై ఘన విజయం
ఐసీసీ 2025 మహిళల వన్డే వరల్డ్‌కప్‌
ఛేదనలో జెమీమా రొడ్రిగస్‌ అజేయ సెంచరీ

అక్టోబర్‌ 30, డివై పాటిల్‌ స్టేడియం,ముంబయి. భారత మహిళల క్రికెట్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. ప్రపంచ మహిళల క్రికెట్‌ మకుటం లేని మహరాణి, ఏడు సార్లు చాంపియన్‌ ఆస్ట్రేలియాను టీమ్‌ ఇండియా చితక్కొట్టింది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచకప్‌ నాకౌట్‌ దశలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించి అదరగొట్టింది. 339 పరుగుల లక్ష్యాన్ని 48.3 ఓవర్లలో ఊదేసిన భారత అమ్మాయిలు.. ఐసీసీ మహిళల 2025 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.

జెమీమా రొడ్రిగస్‌ (127 నాటౌట్‌) అజేయ సెంచరీతో విశ్వరూపం చూపించింది. ఆసీస్‌పై 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించటం అసాధ్యమనుకున్న తరుణంలో లోకల్‌ గర్ల్‌ జెమీమా రొడ్రిగస్‌ అద్భుతం ఆవిష్కరించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (89) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కింది. జెమీమా ఆఖరు వరకు క్రీజులో నిలిచి లక్ష్యాన్ని ఊదేయటంతో.. భారత్‌ ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.

అమ్మాయిలు అసాధ్యం సుసాధ్యం చేశారు. విశ్లేషకుల ఊహాకు సైతం అందని విజయాన్ని అలవోకగా అందుకున్నారు. కొండంత లక్ష్యాన్ని కసితీరా కొట్టేశారు. ఓపెనర్లు ఆరంభంలోనే నిష్క్రమించినా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌, జెమీమా రొడ్రిగస్‌లు భారీ భాగస్వామ్యంతో భారత శిబిరంలో గెలుపు ఆశలు రేకెత్తించగా.. ఆఖరు వరకు క్రీజులో నిలిచిన జెమీమా అమ్మాయిల స్వప్నం సాకారం చేసింది. సెమీఫైనల్లోనే ఏడుసార్లు చాంపియన్‌ ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్‌ ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తాడోపేడో తేల్చుకోనుంది.

నవతెలంగాణ-ముంబయి
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో అద్భుతం జరిగింది. ఏడు సార్లు చాంపియన్‌, అగ్ర జట్టు ఆస్ట్రేలియాకు సెమీఫైనల్లో ఊహించని భంగపాటు ఎదురైంది. గురువారం ముంబయిలోని డివై పాటిల్‌ స్టేడియంలో ఆస్ట్రేలియా తొలుత 338 పరుగుల భారీ స్కోరు చేసినా.. ఆ జట్టు ఇంటిముఖం పట్టక తప్పలేదు. 339 పరుగుల రికార్డు లక్ష్యాన్ని మరో 9 బంతులు ఉండగానే ఛేదించిన భారత్‌ ఆల్‌టైమ్‌ రికార్డు స్కోరును ఊదేసి చరిత్ర సష్టించింది. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ జెమీమా రొడ్రిగస్‌ (127 నాటౌట్‌, 134 బంతుల్లో 14 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (89, 88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ అర్థ సెంచరీతో మెరిసింది.

దీప్తి శర్మ (24, 17 బంతుల్లో 3 ఫోర్లు), రిచా ఘోష్‌ (26, 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆఖర్లో విలువైన ఇన్నింగ్స్‌లు నమోదు చేశారు. దీంతో 48.3 ఓవర్లలో భారత్‌ 341 పరుగులు చేసింది. 5 వికెట్ల తేడాతో అద్వితీయ విజయాన్ని సాధించి ప్రపంచకప్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 10 వికెట్లకు 338 పరుగులు చేసింది. ఆసీస్‌ ఓపెనర్‌ లిచ్‌ఫోల్డ్‌ (119, 93 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో మెరువగా.. ఎలిసీ పెర్రీ (77, 88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆష్లె గార్డ్‌నర్‌ (63, 45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రాణించారు. ఛేదనలో శతక బాదిన జెమీమా రొడ్రిగస్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచింది.

జెమీమా అదరహౌ
భారత్‌ లక్ష్యం 339 పరుగులు. ప్రపంచకప్‌ చరిత్రలోనే నాకౌట్‌లో ఈ స్కోరు ఛేదించిన జట్టు లేదు. దీంతో సహజంగానే ఒత్తిడి భారత్‌పైనే. ఓపెనర్లు షెఫాలీ వర్మ (10), స్మతీ మంధాన (24)లు పవర్‌ప్లే ముగియకుండానే పెవిలియన్‌కు చేరుకున్నారు. 59/2తో టీమ్‌ ఇండియా కష్టాల్లో కూరుకుంది. ఈ సమయంలో జెమీమా రొడ్రిగస్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మూడో వికెట్‌కు 156 బంతుల్లో 167 పరుగులు జోడించారు. తొలుత మంధానతో కలిస 46 పరుగుల భాగస్వామ్యం నిర్మించిన జెమీమా.. ఆ తర్వాత కెప్టెన్‌తో కలిసి మ్యాచ్‌ను మలుపు తిప్పే భాగస్వామ్యం నమోదు చేసింది. ఆసీస్‌ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్‌ చేయటంతో కొన్న అవకాశాలు వచ్చాయి.

కానీ జెమీమా క్యాచులను ఫీల్డర్లు నేలపాలు చేశారు. అవకాశాలను సద్వినియోగం చేసుకున్న జెమీమా.. మ్యాచ్‌ను ఆసీస్‌ నుంచి లాగేసుకుంది. 8 ఫోర్లతో 57 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన జెమీమా.. 10 ఫోర్లతో 115 బంతుల్లో సెంచరీ అందుకుంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కాస్త దూకుడుగా ఆడింది. ఆరు ఫోర్లతో 65 బంతుల్లో అర్థ సెంచరీ బాదింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అవుట్‌ కావటంతో మరోసారి భారత్‌పై ఒత్తిడి కనిపించింది. కానీ దీప్తి శర్మ, రిచా ఘష్‌, ఆమన్‌జోత్‌లతో కలిసి జెమీమా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఒక్కో పరుగే జత చేస్తూ.. అవకాశం దొరికినప్పుడు బౌండరీలు బాదింది. దీంతో మరో 9 బంతులు ఉండగానే భారత్‌ లాంఛనం ముగించింది. 5 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఆఖండ విజయం సాధించింది.

లిచ్‌ఫీల్డ్‌ సెంచరీ
తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా అమ్మాయిలు 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. అలీసా హీలీ (5) వికెట్‌తో క్రాంతి గౌడ్‌ భారత శిబిరంలో ఉత్సాహం నింపింది. కానీ ఆ తర్వాత ఓపెనర్‌ లిచ్‌ఫీల్డ్‌ (119), ఎలిసీ పెర్రీ (77)లు రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నిర్మించారు. లిచ్‌ఫీల్డ్‌ దూకుడుగా ఆడుతూ సెంచరీ సాధించింది. బెత్‌ మూనీ (24), గార్డ్‌నర్‌ (63) సైతం మెరిశారు. దీంతో ఆసీస్‌ భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లలో స్పిన్నర్‌ శ్రీచరణి (2/49), దీప్తి శర్మ (2/73) రెండేసి వికెట్లు పడగొట్టారు.

స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ : అలీసా హీలీ (బి) క్రాంతి 5, లిచ్‌ఫోల్డ్‌ (బి) కౌర్‌ 119, ఎలిసీ పెర్రీ (బి) రాధ 77, మూనీ (సి) జెమీమా (బి) శ్రీచరణి 3, గార్డ్‌నర్‌ (రనౌట్‌) 63, తహ్లియా (రనౌట్‌) 12, అలానా (సి) రిచా (బి) దీప్తి 4, సోఫీ (బి) దీప్తి 6, మేగన్‌ నాటౌట్‌ 1, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (49.5 ఓవర్లలో ఆలౌట్‌) 338.
వికెట్ల పతనం : 1-25, 2-180, 3-220, 4-228, 5-243, 6-265, 7-331, 8-336, 9-336, 10-338.
బౌలింగ్‌ : రేణుక సింగ్‌ 8-0-39-0, క్రాంతి గౌడ్‌ 6-0-58-1, శ్రీచరణి 10-0-49-2, దీప్తి శర్మ 9.5-0-51-1, అమన్‌జోత్‌ కౌర్‌ 8-0-51-1, రాధ యాదవ్‌ 8-0-66-1.
భారత్‌ ఇన్నింగ్స్‌ : షెఫాలీ వర్మ (ఎల్బీ) కిమ్‌ 10, మంధాన (సి) హీలీ (బి) కిమ్‌ 24, జెమీమా నాటౌట్‌ 127, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (సి) గార్డ్‌నర్‌ (బి) సదర్‌లాండ్‌ 89, దీప్తి (రనౌట్‌) 24, రిచా (సి) కిమ్‌ (బి) సదర్‌లాండ్‌ 26, ఆమన్‌జోత్‌ నాటౌట్‌ 15, ఎక్స్‌ట్రాలు , 26, మొత్తం : (48.3 ఓవర్లలో 5 వికెట్లకు) 339.
వికెట్ల పతనం : 1-13, 2-59, 3-226, 4-264, 5-310.
బౌలింగ్‌ : మేగన్‌ షుట్‌ 6-0-40-0, కిమ్‌ గార్త్‌ 7-0-46-2, ఆష్లె గార్డ్‌నర్‌ 8-0-55-0, సోఫి 6.3-0-44-0, సదర్‌లాండ్‌ 10-0-69-2, అలానా 9-0-58-0, తహ్లియా2-0-19-0.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -