ఐదో టెస్టులో వీడని ఉత్కంఠ
నవతెలంగాణ-లండన్ :
భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్టుకు వరుణుడు, వెలుతురు లేమి ఆటంకం కలిగించినా.. ఫలితం కోసం ఇరు జట్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. రికార్డు 374 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ 339/6తో కొనసాగుతుండగా.. భారత్ మరో 4 వికెట్ల కోసం ప్రయత్నిస్తోంది. జో రూట్ (105, 152 బంతుల్లో 12 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (111, 98 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు సెంచరీలతో చెలరేగగా.. ఇంగ్లాండ్ విజయం దిశగా వేగంగా దూసుకెళ్లింది. ఆలస్యమైనా.. వికెట్లు పడగొట్టి రేసులోకి వచ్చిన భారత్ మ్యాచ్‌ను ఐదో రోజుకు తీసుకెళ్లింది. నాల్గో రోజు తొలుత వెలుతురు లేమి, ఆ తర్వాత వర్షం కారణంగా ఆట నిలిచింది. నేడు ఉదయం సెషన్లోనే మ్యాచ్ అటో, ఇటో తేలిపోనుంది.
లాగేసుకున్నారు!
హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) నాల్గో వికెట్‌కు 211 బంతుల్లోనే 195 పరుగులు జోడించి మ్యాచ్‌ను గతిని మార్చేశారు. జాక్ క్రాలీ (14), ఒలీ పోప్ (27) సహా బెన్ డకెట్ (54) నిష్క్రమణతో ఇంగ్లాండ్ 106/3తో నిలిచింది. భారత బౌలర్లు జోరు మీదుండగా ఇంగ్లాండ్‌కు కష్టమే అనిపించింది. కానీ బజ్‌బాల్ జోరు చూపించిన బ్రూక్ దంచికొట్టాడు. ఆరు ఫోర్లు, 2 సిక్సర్లతో 39 బంతుల్లోనే అర్థ సెంచరీ.. 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో 91 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మరో ఎండ్‌లో రూట్ సైతం తనదైన శైలిలో రెచ్చిపోయాడు. రూట్, బ్రూక్ భాగస్వామ్యంతో ఇంగ్లాండ్ ఐదో టెస్టుపై పట్టు బిగించింది.
రేసులోకి..!
300/3తో లక్ష్యం దిశగా దూసుకెళ్లిన ఇంగ్లాండ్‌కు ఇక తిరుగులేదు అనిపించింది. శతకాలు సాధించిన రూట్, బ్రూక్ వికెట్లతో భారత్ మళ్లీ రేసులోకి వచ్చింది. జాకబ్ బెతెల్ (5) సైతం పెవిలియన్‌కు చేరటంతో ఇంగ్లాండ్ ఒత్తిడిలో పడింది. 36 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టిన భారత్.. ఆశలు సజీవంగా నిలుపుకుంది. బౌలర్లు విజృంభిస్తున్న తరుణంలో వెలుతురు లేమి, వర్షం లయను దెబ్బతీసింది. నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 76.2 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ లక్ష్యం 374 పరుగులు. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ (3/109), మహ్మద్ సిరాజ్ (2/95) రాణించారు.
35 పరుగులా? 4 వికెట్లా?
- Advertisement -
- Advertisement -