Wednesday, July 2, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుసిగాచి మృతులు 36 మంది

సిగాచి మృతులు 36 మంది

- Advertisement -

ధ్రువీకరించిన అధికారులు
ఆచూకీ లేని మరో 15 మంది కార్మికులు
80 శాతం కాలిన గాయాలతో మరో ఐదుగురు
34 మందికి ఐదు ఆస్పత్రుల్లో చికిత్స
హృదయవిదారకంగా ఘటనాస్థలి
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండిస్టీస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 36కు చేరింది. మరో 15 మంది కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు. శిధిలాల తొలగింపు ఇంకా పూర్తికాలేదు. ఐదుగురి పరిస్థితి విషయంగా ఉందనీ, వారి శరీరాలు 80 శాతం కాలిపోయి ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. మొత్తంగా 34 మంది క్షతగాత్రులు ఐదు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగి రెండు రోజులు గడిచినా కంపెనీ యాజమాన్యం సంఘటనా స్థలానికి రాలేదు. సోమవారం సిగాచి కంపెనీలో డ్రయ్యర్‌, రియాక్టర్‌ పేలి పెను ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో కంపెనీలో 143 మంది కార్మికులు, సిబ్బంది డ్యూటీలో ఉన్నారని నిర్థారించారు. మొత్తం 92 మంది ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

సంఘటనా స్థలం మరుభూమిని తలపిస్తోంది. మృతుల శరీరభాగాలు వేర్వేరుగా పడిఉన్నాయి. కాలిపోయి, గుర్తుపట్టలేనంతగా కొన్ని మృతదేహాలు ఉన్నాయి. ఘటనా స్థలంలో ఏ మాంసం ముద్ద దొరికినా దాన్ని పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలిస్తున్నారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా కుటుంబసభ్యుల్ని గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు 12 మృతదేహాలను గుర్తించి, పోస్టుమార్టం తర్వాత బంధువులకు అప్పజెప్పారు. ప్రత్యేక అంబులెన్స్‌ల ద్వారా ఆయా మృతదేహాలను వారి స్వగ్రామాలకు పంపారు. ఆచూకీ లభించని 15 మంది కార్మికుల కుటుంబాల ఆక్రందనలతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా ఉంది.

మంగళవారం ఘటనా స్థలిని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి కంపెనీ యాజమాన్యంపై సీరియస్‌ అయ్యారు. బాధ్యతలేకుండా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు. మంత్రులు, జిల్లా కలెక్టర్‌ శిధిలాల తొలగింపు, ఇతర చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. కంపెనీలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వివరాల రికార్డులు ఏవీ కంపెనీ వద్ద లేవని తెలిసింది. యాజమాన్యంపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి శిక్షించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.


హృదయవిదారకం
మృతులు, క్షతగాత్రుల కుటుంబసభ్యుల అగచాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎక్కడ ఉండాలో, ఏం తినాలో చూసే నాథుడులేడు. ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి బిల్లులు ఎవరు చెల్లిస్తారో తెలియట్లేదు. మరికొందరు మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రుల్ని కార్పొరేట్‌ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మృతుల్లో ఒడిశా, బీహార్‌, చత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన వాళ్లు ఉన్నారు. పొద్దుటూరుకు చెందిన నిఖిల్‌రెడ్డి, శ్రీరమ్య ఇటీవలే ప్రేమించి పెండ్లి చేసకున్నారు. ఇద్దరూ ఇదే కంపెనీలో పనిచేస్తున్నారు. దుర్ఘటనలో ఇరువురూ చనిపోయారు.


ఒడిశాకు చెందిన ప్రశాంత్‌ మాపత్రి(45) చనిపోవడంతో భార్య సోనాలి, కొడుకులు సోము, సువన్‌ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బండ్లగూడకు చెందిన ఎస్‌.జప్టిన్‌, బీహార్‌కు చెందిన రాజ్‌కుమార్‌, పాశ్వాన్‌, ఒడిశాకు చెందిన సిదార్ధ హడి (18) మృతదేహాల కోసం బంధువులు రోదిస్తూ ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -