Saturday, December 13, 2025
E-PAPER
Homeజాతీయంఆరేండ్లలో 4.57 కోట్ల జాబ్‌ కార్డుల తొలగింపు

ఆరేండ్లలో 4.57 కోట్ల జాబ్‌ కార్డుల తొలగింపు

- Advertisement -

లోక్‌సభకు తెలిపిన కేంద్రం

న్యూఢిల్లీ : 2019-20, 2024-25 మధ్యకాలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకానికి సంబంధించి దేశవ్యాప్తంగా 4.57 కోట్ల జాబ్‌ కార్డులను తొలగించడం జరిగిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ లోక్‌సభకు తెలియజేశారు. అదే కాలంలో 6.54 కోట్ల కొత్త జాబ్‌ కార్డులను చేర్చడం జరిగిందని ఆయన చెప్పారు. బీహార్‌లో అత్యధికంగా 1.04 కోట్ల జాబ్‌ కార్డులను తొలగించారు. ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటిలోనూ కలిపి తొలగించిన జాబ్‌ కార్డుల కంటే ఒక్క బీహార్‌లో తొలగించిన కార్డుల సంఖ్యే అధికంగా ఉంది. 2022-23, 2023- 24లో ఆ రాష్ట్రంలో ఏకంగా 79.82 లక్షల కార్డులను తీసేశారు. బీహార్‌ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో 91.48 లక్షల కార్డులు తొలగింపునకు గురయ్యాయి. 44.07 లక్షల తొలగింపులతో ఒడిశా మూడో స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో 37.90 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో 36.14 లక్షల కార్డులను తొలగించారు. మొత్తంగా చూస్తే 2022-23లో ఎక్కువ కార్డులను తొలగించారు. 2019-20లో 14.32 లక్షలు, 2020-21లో 27.96 లక్షలు, 2021-22లో 50.31 లక్షల కార్డులు తొలగింపునకు గురవగా 2022-23లో అసాధారణ రీతిలో 2.24 కోట్ల జాబ్‌ కార్డులను తీసేశారు.

2023-24లో తొలగింపులు కొంతమేర తగ్గినప్పటికీ 1.01 కోట్లతో అధికంగానే జరిగాయి. 2024-25లో 38.59 కార్డులను తొలగించారు. అక్టోబర్‌ 10-నవంబర్‌ 14 మధ్య అంటే కేవలం 36 రోజుల వ్యవధిలోనే 16.31 లక్షల కార్మికుల జాబ్‌ కార్డులు తొలగింపునకు గురయ్యాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ 11.07 లక్షలతో మొదటి స్థానంలో నిలవగా ఒడిశా(80,896), జమ్మూకాశ్మీర్‌ (79,070), ఉత్తరప్రదేశ్‌ (17,236) తర్వాతి స్థానాలలో ఉన్నాయి. తప్పుడు లేదా డూప్లికేట్‌ ఎంట్రీలు, అవాస్తవ సమాచారం, శాశ్వత వలసలు, గ్రామ పంచాయతీలను పట్టణ ప్రాంతాలుగా మార్చడం, మరణాలు వంటి కారణాలతో జాబ్‌ కార్డులు తొలగింపునకు గురయ్యాయని మంత్రి చౌహాన్‌ తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన చెప్పారు. తమ జాబ్‌ కార్డుల తొలగింపునకు వ్యతిరేకంగా కార్మికులు వివిధ పద్ధతుల ద్వారా ఫిర్యాదులు దాఖలు చేయవచ్చునని అన్నారు. కొత్తగా తప్పనిసరి చేసిన ఎన్‌ఎన్‌ఎంస్‌, ఏపీబీఎస్‌ డిజిటల్‌ వ్యవస్థలు కూడా పెద్ద ఎత్తున జాబ్‌ కార్డుల తొలగింపునకు కారణమై ఉండవచ్చునని చౌహాన్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -