వైపని కార్మికులకు కూడా వర్కర్ టూ ఓనర్ పథకం వర్తింపచేయాలి
జనవరి – 9 న చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద ధర్నా
సిఐటియు – తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ పిలుపు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
1104 మంది నేతన్నలకు ఒక్కొక్కరికి నాలుగు మరమగాల చొప్పున వర్కర్ టు ఓనర్ పథకంలో భాగంగా ఇవ్వాలని సిఐటియు తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ , ముషం రమేష్ లు డిమాండ్ చేశారు. సిరిసిల్లలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా సిరిసిల్ల పెద్దూరులో ఏర్పాటుచేసిన వర్కర్ టూ ఓనర్ పథకానికి సంబంధించి 1104 మంది పవర్లూమ్ కార్మికులకు వెంటనే నాలుగు పవర్లుమ్స్ చొప్పున ప్రభుత్వం మంజూరు చేసి కార్మికులకు అందించి కార్మికులను యజమానులు చేయాలని వారు పేర్కొన్నారు.
వర్కర్ టూ ఓనర్ షెడ్లలో 60 వార్పిన్లను వార్పిన్ కార్మికులకు అందించాలని , వైపని కార్మికులకు వర్కర్ టు ఓనర్ పథకం వర్తింపచేయాలని , ఇందిరా మహిళ శక్తి చీరలకు పవర్లూమ్ కార్మికులతో పాటు వార్పిన్ , వైపని అనుబంధ రంగాల కార్మికులందరికీ 10% యారన్ సబ్సిడీ అందించాలనే డిమాండ్లతో – పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జనవరి 9 న ఉదయం 10 గంటలకు బి.వై. నగర్ లోని చేనేత శాఖ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంద నీ ధర్నా కార్యక్రమానికి పవర్లూమ్ కార్మికులతో పాటు వార్పిన్ , వైపని అనుబంధ రంగాల కార్మికులందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.
వర్కర్ టూ ఓనర్ పథకం గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం పూర్తిచేసి కార్మికులకు అందించవలసింది కానీ నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహించడం మూలంగా మూడు సంవత్సరాల నిర్మాణం పూర్తయిన వర్క్ షెడ్లు అలాగే ఉండిపోవడం జరిగిందని సిరిసిల్ల ఎమ్మెల్యే , మాజీ మంత్రి కేటీఆర్ వర్కర్ టూ ఓనర్ షెడ్లను సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేస్తుందని అన్నారు వారు అధికారంలో ఉన్నప్పుడే వర్కర్ టు ఓనర్ పథకాన్ని పూర్తిచేసి కార్మికులకు అందిస్తే ఈ సమస్యనే రాకుండా పోయేదని కార్మికులు యజమానులుగా మారి మూడు సంవత్సరాలు అయిపోయేదన్నారు బి.ఆర్.ఎస్ , బిజెపి , కాంగ్రెస్ పార్టీ లకు కార్మికుల ఓట్లు కావాలి తప్ప వాళ్ళ సమస్యలు పరిష్కరించడంపై చిత్తశుద్ధి లేదన్నారు కార్మికులు ఇప్పటివరకు సాధించుకున్న హక్కులన్నీ పోరాటాల ద్వారానే రావడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా కూడా కార్మికులకు వర్కర్ టూ ఓనర్ పథకం పూర్తిచేసి కార్మికులకు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిర్మాణం పూర్తయిన షెడ్లను ఇతర పెట్టుబడుదారులకు కేటాయించాలని ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు.
కార్మికుల ఆకలి చావులు , ఆత్మహత్యలను నివారించాలని కార్మికులు ఆత్మస్థైర్యంతో బతికే విధంగా శాశ్వత ఉపాధి కల్పించి భరోసా కల్పించాలననే ఉద్దేశంతో తీసుక వచ్చిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం కార్మికులకు బ్యాంకు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడంలేదని మరియు ఇతర అంశాలను సాకుగా చూపి షెడ్లను పెట్టుబడుదారులకు అప్పజెప్పాలని చేస్తున్న ప్రయత్నాలను మానుకోవాలని ప్రభుత్వమే బాధ్యత వహించి కార్మికులకు బ్యాంకు రుణాలు ఇప్పించాలని వర్క టూ ఓనర్ షెడ్లు ఒక్కటి కూడా ఇతరులకు కేటాయిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు.
అదేవిధంగా గత ప్రభుత్వం ప్రభుత్వ వస్త్రాలకు 10 శాతం కూలీ సర్దుబాటు కింద యారన్ సబ్సిడీ 1- 42 పైసలు మీటర్ కు ఇవ్వడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ వస్త్రాలను తయారు చేయించుకుంటుంది ఇప్పటివరకు 10% యారన్ సబ్సిడీ కార్మికులకు అందిస్తామని ప్రకటించడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు – పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ తదితరులు పాల్గొన్నారు.



