– పాలస్తీనియన్లు లక్ష్యంగా గాజాలో కొనసాగుతున్న మారణకాండ
– సహాయార్ధులు, సహాయక శిబిరాలపైనా దాడులు
గాజా : అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) అండదండలతో, కార్పొరేట్ కంపెనీల చేయూతతో ఇజ్రాయిల్ యుద్ధోన్మాదంతో ఊగిపోతోంది. గత 21 నెలల కిందట మొదలైన ఈ మారణకాండలో ఇప్పటి వరకు 60 వేల మంది పైగా సాధారణ పౌరులు చనిపోయారు. వీరిలో అత్యధికులు చిన్నారులు, మహిళలే. గాజాలో కలుగుల్లో దాగున్న హమస్ తిరుగుబాటు దారులను అణిచేసే పేరుతో మొదలైన ఇజ్రాయిల్ సైనిక దాడులు ..అంతకంతకూ విస్తరించి జాత్యాం హకార దాడులుగా మారిపోయాయి. రక్తం రుచి మరిగిన పులిలా చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఊళ్లకు ఊళ్లనే మట్టుపెడుతోంది. నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ప్రార్థన మందిరాలు, ఆస్పత్రులు, సహాయక శిబిరాలు అనే తేడా లేకుండా ఎడాపెడా క్షిపణి దాడులు చేస్తూ నిత్యం వందలాది మందిని హత్య చేస్తోంది.
2023 అక్టోబర్‌లో మొదలైన ఈ యుద్ధోన్మాద దాడుల్లో కనీసం 60,034 మంది చనిపోయారని గాజా ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఆకలితో అలమటిస్తూ..దప్పిక తీరే దిక్కులేక సహాయక శిబిరాల వద్ద గుప్పెడు మెతుకుల కోసం, గొంతు తడిపేంత నీటి కోసం కుస్తీలు పడుతున్న నిస్సాయులపై ఇజ్రాయిల్ సైనిక బలగాలు వైమానిక దాడులతో విరుచుకు పడుతూనేవున్నాయి.
సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఇదే తరహా దాడుల్లో 62 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. వీరిలో 19 మంది సహాయం కోసం ఎదురుచూస్తున్న అభాగ్యులుండటం దయనీయం. వీరి మరణాలతో ఇప్పటి వరకు ఇజ్రాయిల్ దాడుల్లో చనిపోయినవారి సంఖ్య 60 వేలు దాటింది. ఈ దాడుల్లో మరో 1.45 లక్షల మంది గాయపడ్డారు. మతుల్లో దాదాపు సగం మంది మహిళలు, చిన్నారులేనని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 662 రోజులుగా సాగించిన ఈ మారణకాండలో గాజా మొత్తం జనాభాలో ప్రతి 36లో ఒకరిని చంపేసినట్లు అయ్యింది. రోజు సగటున 90 మందిని హత్య చేశారు. అంతర్జాతీయ సమాజం అందిస్తున్న మానవ సహాయాన్ని ఇజ్రాయిల్ అడ్డుకొని ఆటంకాలు సృష్టించిన కారణంగా సకాలంలో సహాయాన్ని పొందలేక ఆకలి దప్పికలతో అలమటించి 147 మంది చనిపోయారు. ఇలా చనిపోయినవారిలో 88 మంది చిన్నారులే.
అత్యంత దారుణ పరిస్థితులు…
ఇజ్రాయిల్ దాడుల కారణంగా గాజాలో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని ప్రపంచ ఆకలి మానిటరింగ్ వ్యవస్థ అయిన ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ పేజ్ క్లాసిఫికేషన్ (ఐపీసీ) ఒక నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార సంక్షోభంతో కొంతకాలంగా గాజా పౌరుల పరిస్థితి దయనీయంగా మారిందని, ఆకలి బాధతో జీవన్మరణ పోరాటం చేస్తున్నారని ఐపీసీ పేర్కొంది. స్థానికంగా అత్యంత దారుణమైన కరవు పరిస్థితి నెలకొందని, తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున మరణాలు సంభవించే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి సహకారంతో రూపొందిన ఈ నివేదికలో ఐపీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘మే-జులై మధ్యకాలంలో తీవ్ర ఆకలిని ఎదుర్కొంటున్న కుటుంబాల సంఖ్య రెట్టింపు అయ్యింది. గాజా సిటీలో పోషకాహార లోపం రేటు మేలో 4.4 శాతంగా ఉండగా.. జులై నాటికి ఏకంగా 16.5 శాతానికి పెరిగింది. గర్భిణులు, బాలింతల్లో ఐదింట రెండొంతుల మంది జూన్‌లో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడ్డారు’ అని పేర్కొంది.
ఇజ్రాయిల్ యుద్ధోన్మాదానికి 60 వేల మంది బలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES