నవతెలంగాణ-హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం చేపట్టిన విషయం విదితమే. ఈ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, దీనికి సంబంధించిన ముసాయిదా జాబితాను ఈసీ ఇటీవల విడుదల చేసింది.
ఈ జాబితాలో దాదాపు 65 లక్షల మంది ఓటర్లను చేర్చలేదని వెల్లడించింది. ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7.9 కోట్లుగా ఉండగా, తాజా ముసాయిదా జాబితాలో ఆ సంఖ్య 7.24 కోట్లకు తగ్గింది.
రాజధాని పాట్నాలో అత్యధికంగా 3.95 లక్షలు, మధుబనీలో 3.52 లక్షలు, ఈస్ట్ చంపారన్ లో 3.16 లక్షలు, గోపాల్ గంజ్ లో 3.10 లక్షల మంది ఓటర్లు సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించకపోవడంతో వారిని ఈ జాబితాలో చేర్చలేదని ఈసీ తెలిపింది.
మొత్తం జాబితాలో 22.34 లక్షల మంది ఓటర్లు మరణించారని, 36.28 లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడం లేదా ఆయా చిరునామాల్లో లేరని ఈసీ గుర్తించింది. మరో 7.01 లక్షల మంది ఒకటి కన్నా ఎక్కువసార్లు నమోదు చేసుకున్నట్లు గుర్తించామని ఈసీ పేర్కొంది.
కాగా, ముసాయిదా జాబితాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన ఈసీ, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 1లోగా తెలియజేయవచ్చని పేర్కొంది. అనంతరం ఓటర్ల తుది జాబితాను ఈసీ ప్రచురించనుంది.