శ్రీలంకలో మూడు స్టేడియాలు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ స్టేడియాల ఎంపిక
నవతెలంగాణ-ముంబయి
2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్ భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు పొట్టి ప్రపంచకప్ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 20 దేశాలు పోటీపడుతున్న ఈవెంట్‌కు వేదికలను ఐసీసీ ఇటీవల ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. భారత్‌లో ఐదు వేదికలు, శ్రీలంకలో మూడు స్టేడియాలు ఐసీసీ కుదించిన వేదికల జాబితాలో ఉన్నట్టు సమాచారం. అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కత, ముంబయి, చెన్నై నగరాలు భారత్‌లో ఆతిథ్య వేదికలుగా ఎంపికవగా… కొలంబోలో రెండు స్టేడియాలు, క్యాండీలో ఓ స్టేడియం శ్రీలంక నుంచి ఎంపికైనట్టు తెలుస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఓవరాల్‌గా ఎనిమిది వేదికల్లో జరుగనుంది.
అహ్మదాబాద్‌లో ఫైనల్!
ఫిబ్రవరి 7న ఆరంభ మ్యాచ్, మార్చి 8న ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదికగా నిలిచే అవకాశం ఉంది. ఒకట్రెండు వారాల్లో షెడ్యూల్, వేదికలు సహా టికెట్ల కొనుగోలు వివరాలను ఐసీసీ అధికారికంగా వెల్లడించనుంది. టీ20 ప్రపంచకప్‌కు మరో మూడు నెలలే ఉండటంతో ఇతర దేశాల క్రికెట్ బోర్డులు షెడ్యూల్, ఇతర అంశాలపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నాయి.
పాక్ మ్యాచులు శ్రీలంకలో..
భారత్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల ఒప్పందం ప్రకారం ఐసీసీ, ఏసీసీ టోర్నమెంట్లలో ముఖాముఖి తలపడినా.. తటస్థ వేదికపైనే పోటీపడతాయి. దీంతో టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలో నిర్వహిస్తారు. పాకిస్తాన్ సెమీఫైనల్, ఫైనల్‌కు చేరుకుంటే.. ఆ మ్యాచ్‌లు సైతం శ్రీలంకలోనే జరుగుతాయి.
బరిలో 20 దేశాలు
ఆతిథ్య జట్లు భారత్, శ్రీలంక నేరుగా అర్హత సాధించాయి. 2024 టీ20 ప్రపంచకప్‌లో టాప్-7లో నిలిచిన అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యుఎస్‌ఏ, వెస్టిండీస్‌లు నేరుగా అర్హత సాధించాయి. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ నుంచి న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ చేరుకున్నాయి. అర్హత టోర్నీల్లో గెలుపొందిన కెనడా, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, యుఏఈ, ఓమన్‌లు టీ20 ప్రపంచకప్‌లో ఆడనున్నాయి. 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్ చాంపియన్‌గా నిలువగా.. దక్షిణాఫ్రికా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.



