‘అరైవ్ అలైవ్’ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణలో డీజీపీ శివధర్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రతి ఏటా రోడ్డు ప్రమాదంలో 8 వేల మంది మరణిస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రిసరాలను గమనిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టొచ్చని ఆయన చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా రాష్ట్రంలో 800 హత్యలు జరుగుతుంటే దానికి 10 రెట్లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవుతున్నారని తెలిపారు. దీనిని తీవ్రమైన సమస్యగా పరిగణించి రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని కోరారు. అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్రతి ఏటా సగటున 3 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనీ, ఆయా ప్రమాదాల్లో 300 మంది వరకు మరణిస్తున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాపిక్ ఉల్లంఘనులపై కఠినంగా వ్యవహారిస్తున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి వెంటనే తమ వంతుగా సాయం చేయాలని సూచించారు. సినీ నటుడు బాబుమోహన్ మాట్లాడుతూ ఎంతో మందిని నవ్వించిన తాను తన కుమారున్ని రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకున్నానని భావోద్వేగానికి గురయ్యారు. డ్రైవింగ్ చేసే సమయంలో ప్రతి ఒక్కరు వారి కుటుంబాలను గుర్తు పెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐజీపీ (రోడ్ సేఫ్టీ), పోలీసు అధికారులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.



