– ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు
– అత్యధికంగా భువనగిరిలో 92.88 శాతం
– అత్యల్పంగా కొత్తగూడెంలో 71.79
– మూడు పంచాయతీల్లో సమాన ఓట్లు
– లాటరీ ద్వారా ఫలితాన్ని తేల్చిన అధికారులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా 189 మండలాల్లోని 3,834 పంచాయతీల్లో గురువారం జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 84.28 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88 శాతం, ఆ తర్వాత మూడు జిల్లాల్లో 90 శాతానికిపైగా పోలింగ్ జరిగింది. నల్లగొండలో 90.53, సూర్యాపేటలో 90.18, ఖమ్మంలో 90.16 శాతం పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79 శాతం, ఆ తర్వాత ఆదిలాబాద్‌లో 75.25, జగిత్యాలలో 77.68, ములుగులో 78.65 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. మొదటి రెండు గంటల్లో 21.07 శాతం పోలింగ్ నమోదు కాగా, ఆ తర్వాత 9 నుంచి 11 గంటల వరకు 53.04 శాతం ఓటింగ్ నమోదైంది. 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చివరి రెండు గంటల్లో 30 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడంతో మొత్తం 84.28 శాతానికి చేరుకుంది. ఏకగ్రీవం, నామినేషన్ దాఖలు కాని గ్రామాలను మినహాయిస్తే మొత్తం 53,57,277 మంది ఓటర్లకు గాను 45,151,41 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 21,99,267 మంది పురుషులు (84.16 శాతం), 23,157,96 మంది మహిళలు (84.40 శాతం), 78 మంది ఇతరలు (41.27 శాతం) ఓటింగ్‌లో పాల్గొన్నారని ఎన్నికలసంఘం తెలిపింది. .
మూడు స్థానాల్లో లాటరీ ద్వారా ఫలితాలు
మూడు పంచాయతీ స్థానాల్లో ఇరువురు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో అధికారులు లాటరీ ద్వారా విజేతను ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మక్కపల్లిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులకు 148 ఓట్లు వచ్చాయి. దాంతో, విజేతను తేల్చడం కోసం అధికారులు లాటరీ తీశారు. ఈ లాటరీలో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఇండ్ల రాజయ్య సర్పంచ్‌గా ఎంపికయ్యారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం చిన్న ఎల్క చెర్లలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు 212 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్‌లోనూ ఇద్దరికీ సమాన ఓట్లు రావడంతో అధికారులు.. టాస్ వేశారు. అందులో కాంగ్రెస్ అభ్యర్థి మరాఠి రాజ్‌కుమార్‌ను అదృష్టం వరించింది. ఇక రేగోడ్ మండలం కొండాపూర్‌లో ఒక్క ఓటు తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి బేగరి పాండరి గెలుపొందారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సూరంపల్లిలోనూ లాటరీ తప్పలేదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులకు సమానంగా 276 ఓట్లు వచ్చాయి. లాటరీ తీయగా బీఆర్‌ఎస్ బలపర్చిన మైలారం పోచయ్య సర్పంచ్‌గా ఎంపికయ్యారు.
84.28 శాతం పోలింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



