Monday, November 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం84కోట్ల చేపపిల్లలు పంపిణీ

84కోట్ల చేపపిల్లలు పంపిణీ

- Advertisement -

రూ.123 కోట్ల బడ్జెట్‌తో ఐదు లక్షల మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే యత్నం
‘స్టేషన్‌’లో చేపపిల్లలు, రొయ్యల పెంపకం కేంద్రం
అంబేద్కర్‌ ఇచ్చిన వజ్రాయుధం ఓటుహక్కు, రాజ్యాంగం
సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి వాకిటి శ్రీహరి

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో రూ.123కోట్లతో 84 కోట్ల చేప పిల్లలు, 20 కోట్ల రొయ్య పిల్లలను వంద శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ, యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం హన్మకొండ జిల్లా ధర్మసాగర్‌ రిజర్వాయర్‌లో వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి విడుదల చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చేపల పెంపకంతో తెలంగాణ బ్రాండ్‌ ఇమేజీని పెంపొందించడానికి కీషి చేస్తున్నామన్నారు. రూ.123 కోట్ల బడ్జెట్‌తో 5 లక్షల మత్స్యకారుల జీవితాలను మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. నిధులను మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి, రాష్ట్ర మంత్రివర్గానికి మంత్రి శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. ధర్మసాగర్‌ రిజర్వా యర్‌లో 12.50 లక్షల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకుగాను రూ.2.25 కోట్లను వెచ్చిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో 88 కోట్ల చేపపిల్లలు అవసరమని, ఇందులో 20 శాతం చేప పిల్లలను రాష్ట్రంలోనే ఉత్పిత్తి చేయాల్సి వుంటుందన్నారు. ప్రతియేటా మార్చిలోనే బడ్జెట్‌ కేటాయిస్తారని, నేను మంత్రి కావడంలో ఆలస్యం కావడంతో మత్స్యశాఖ బడ్జెట్‌ను ఇవ్వడంలోనూ జాప్యం జరిగిందని, దీంతో చేప పిల్లల పంపిణీలోనూ ఆలస్యం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల చెరువుల్లో నిష్పత్తి ప్రకారం చేప పిల్లలను విడుదల చేయనున్నట్లు చెప్పారు. చేప పిల్లల సైజ్‌లో, సంఖ్యలో రాజీ పడొద్దన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల మధ్య వున్న గొలుసుకట్టు చెరువుల్లో పెంచిన చేపల రుచి తెలంగాణ బ్రాండ్‌ చేపగా ప్రసిద్ధి చెందేలా కృషి చేయాలని మత్స్యకారులను కోరారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో చేప పిల్లలు, రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని మంజూరు చేస్తున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఇవ్వాలని కోరగానే మంత్రి సానుకూలంగా స్పందించారు. మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే రాష్ట్రంలోని మత్స్యకారులకు రూ.1.40 కోట్లతో అందరికీ బీమా సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఇచ్చిన వజ్రాయుధం ఓటు హక్కు, రాజ్యాంగమని అవి కల్పించిన హక్కులను ఎంత మేరకు వినియోగించుకుంటున్నామో ఆలోచించాలన్నారు.

‘దేవాదుల’ రిజర్వాయర్లు అనుకూలం : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
దేవాదుల ప్రాజెక్టు కింద తన నియోజకవర్గంలో 7 రిజర్వాయర్లున్నాయని, అన్నిటిలో 365 రోజులు నీరు వుంటుందని, ఇవి చేపల పెంపకానికి అనుకూలంగా వున్నా యని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. మత్స్య సహకారం సంఘాల్లో పెండింగ్‌లో వున్న సభ్యత్వా లను వెంటనే వారికి సభ్యత్వాలివ్వాలని కోరారు. సమావేశం లో ముదిరాజ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ బొర్రా జ్ఞానేశ్వర్‌, తెలంగాణ ఫిషరీస్‌ ఫెడరేషన్‌ ఛైర్మెన్‌ మెట్టు సాయికుమార్‌, తెలంగాణ రాష్ట్ర క్రీడల ప్రాధికారిక సంస్థ చైర్మెన్‌ శివసేనా రెడ్డి, రాష్ట్ర మత్స్యశాఖ సంచాలకులు నిఖిల, జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ ప్రసంగించారు. ఈ సమావేశంలో మత్స్య శాఖ అదనపు సంచాలకులు శ్రీనివాస్‌, డీడీ హనుమంత రావు, హన్మకొండ జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి, ఛీఫ్‌ ప్రమోటర్‌ బుస్సా మల్లేశం, సోమయ్య, తహశిల్దార్‌ సదానందం, ఎంపిడీవో అనిల్‌కుమార్‌, మత్స్య సహకార సంఘాల ఛైర్మెన్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -