Thursday, September 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఒకే రోజు 980 కేసుల విచారణ

ఒకే రోజు 980 కేసుల విచారణ

- Advertisement -

– అన్నింటి ఫిర్యాదుదారుడు ఒక్కరే..
– నేడు హైదరాబాద్‌లో తెలంగాణ సమాచార కమిషన్‌లో విచారణకు నోటీసులు
నవతెలంగాణ-కాగజ్‌నగర్‌

తెలంగాణ సమాచార శాఖ కమిషన్‌ భవన్‌లో గురువారం ఒకే రోజు 980 కేసులను విచారించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ నుంచి ఫిర్యాదుదారుడికి సమాచార కమిషన్‌ నోటీసులు పంపింది. ఈ కేసులన్నీ కూడా ఒకే ఫిర్యాదుదారుడికి చెందినవి కావడం గమనార్హం. కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త మహ్మద్‌ అష్రఫ్‌ పలు ప్రభుత్వ శాఖలలో సమాచారం కోసం దరఖాస్తు చేశారు. సకాలంలో ఆయా శాఖల అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో మహ్మద్‌ అష్రఫ్‌ సమాచార కమిషన్‌లో అప్పీలు చేశారు. మొదటి అప్పీలుపై సంబంధిత శాఖ అధికారులు స్పందించలేదు. దీనితో రెండో అప్పీలును సమాచార కమిషనర్‌కు చేశారు. అప్పీళ్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో ఒకే రోజు విచారించి పరిష్కరించాలని సమాచార కమిషన్‌ నిర్ణయించింది. అష్రఫ్‌ అప్పీలు చేసిన కేసులు మొత్తం 980 ఉన్నట్టు తేలింది. ఇందులో హోంశాఖకు చెందినవి 218, రెవెన్యూ 259, విద్యాశాఖ 231, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ 28, ఉన్నత విద్యాశాఖ 40, మైనార్టీ 50, వ్యవసాయ శాఖ 31, పంచాయతీరాజ్‌ 32, మున్సిపల్‌ 16, గిరిజన శాఖ 44, రవాణా శాఖ నాలుగు, ఫైనాన్స్‌ ఆరు, ఆరోగ్య శాఖ ఆరు, పర్యావరణ శాఖ రెండు, ఎనర్జీ శాఖకు సంబంధించిన ఒక కేసు ఉంది.

ఈ విచారణ న్యాయబద్దం కాదు : మహ్మద్‌ అష్రఫ్‌
ఒకే రోజు 980 కేసుల విచారణ అనేది న్యాయబద్దం కాదని సహ చట్టం కార్యకర్త మహ్మద్‌ అష్రఫ్‌ అన్నారు. తూతూ మంత్రంగా ఈ విచారణ చేపట్టేందుకు అధికారులు నిర్ణయించినట్టుగా ఉందని విమర్శించారు. ఇంత స్వల్ప వ్యవధిలో ఇన్ని కేసుల విచారణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో వాదనలు వినకుండా సమాచార కమిషన్‌ ఎలా తీర్పు ఇస్తుందన్నారు.

ఫుల్‌ బెంచ్‌ ద్వారా విచారణ : నయీమొద్దీన్‌, పర్సనల్‌ సెక్రటరీ, సమాచార కమిషనర్‌
ఒకే రోజు 980 కేసులను ఫుల్‌ బెంచ్‌ ద్వారా విచారణ చేపట్టనున్నట్టు కమిషనర్‌ పర్సనల్‌ సెక్రటరీ నయీమొద్దీన్‌ తెలిపారు. ఈ కేసుల విచారణకు చీఫ్‌ కమిషనర్‌తో పాటు ఐదుగురు కమిషనర్‌లు హాజరు కానున్నారని, అందరూ కలిసి ఈ కేసులను విచారిస్తారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -