మూడు నెలలు నెగెటివ్ ద్రవ్యోల్బణం
పాలనా వైఫల్యానికి నిదర్శనం : మాజీ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దిశగా పయనిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మూడు నెలలు నెగెటివ్ ద్రవ్యోల్బణం పాలనా వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు. అనాలోచిత విధానాలతో ఆర్థిక నిర్వహణలో రేవంత్ సర్కారు విఫలమైందని విమర్శించారు. రాష్ట్రం తిరోగమనం వైపు పయనిస్తున్నదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదైతే, తెలంగాణలో నెగెటివ్ ద్రవ్యోల్బణం నమోదవుతుండటం మందగించిన ఆర్థిక పతనానికి సంకేతమని చెప్పారు.
జూన్‌లో -0.93 శాతం, జులైలో 0.44 శాతం, సెప్టెంబర్‌లో 0.15 శాతంతో వరుసగా నాలుగు నెలల్లో మూడు నెలలు డిఫ్లేషన్ నమోదు కావడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణాత్మక ద్రవ్యోల్బణం మూడు సార్లు నమోదు కావడం ఇదే మొదటి సారి అని పేర్కొన్నారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో సాధారణంగా వినియోగం పెరిగి, పాజిటివ్ ద్రవ్యోల్బణం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ, కానీ, నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు కావడం రాష్ట్ర ఆర్థిక విధానాల వైఫల్యమని తెలిపారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలన, ఆర్థిక అరాచకత్వం వల్ల రాష్ట్రం ఆర్థిక తిరోగమనం వైపు పయనిస్తున్నదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుల్డోజర్ విధానాలు, ప్రతీకార రాజకీయాలు మానుకొని చతికిల పడిపోతున్న రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.