అంతర్జాతీయ రైల్వే సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారతీయ రైల్వేల్లో ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గడచిన 11 ఏండ్లలో రైల్వేల ఆధునీకరణ, అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామనీ, ఇప్పుడు ఆ ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు. బుధవారం ఢిల్లీలో రైల్వే మంత్రిత్వ శాఖ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సంయుక్తాధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ రైల్వే సదస్సు-2025 సందర్భంగా ఏర్పాటు చేసిన 16వ అంతర్జాతీయ రైల్వే పరికరాల ప్రదర్శన (ఐఆర్‌ఈఈ)ని ప్రారంభించి, ఆయన మాట్లాడారు. గడచిన 11 ఏండ్లలో దాదాపు 35 వేల కిలోమీటర్ల కొత్త ట్రాక్‌లు, 46 వేల కిలో మీటర్ల రైల్వేలైన్లను విద్యుదీకరించామని తెలిపారు.
భారతీయ రైల్వేలు ప్రస్తుతం 156 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు, 30 అమృత్ భారత్, 4 నమో భారత్ సర్వీసులు నడుపుతుందనీ, ఇవి దేశవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయని చెప్పారు. ఏటా ఏడువేల కోచ్‌లను తయారు చేస్తున్నామనీ, భారతదేశ పురోగతికి ఇవి ప్రత్యక్ష ఉదాహరణలు అని తెలిపారు. ఈ సందర్భంగా భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), గతి శక్తి విశ్వ విద్యాలయ మధ్య ఒక అవగాహన ఒప్పందం జరిగింది. మూడు రోజులు జరిగే ఈ ప్రదర్శనలో పలు అంశాలపై చర్చలు, అంతర్జాతీయ భాగస్వామ్యం, వ్యాపార సమావేశాలు, సాంకేతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, నెదర్లాండ్స్, దక్షిణకొరియా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ సహా మొత్తం 140 దేశాల నుంచి 20 వేలకు పైగా పరిశ్రమ నిపుణులు హాజరవుతున్నారు.
రైల్వేల్లో పెట్టుబడులకు ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES