నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
ప్రతి మనిషి శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం తీసుకోవడం అత్యంత అవసరమని, ఫలితంగా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు జాతీయ పోషణ మాసం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాల భవన్ లో ఐసిడిఎస్ గద్వాల అర్బన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ముగింపు కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని ఏటా పోషణ మాసం కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళలు గర్భం దాల్చిన సమయం నుంచి ప్రసవం అనంతరం బిడ్డకు సుమారు వెయ్యి రోజులు పౌష్టికాహారంతో కూడిన పోషణ ఆవశ్యకత గురించి వివరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.
ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తో పాటు ప్రోటీన్స్, విటమిన్స్, తదితర సమపాళ్లల్లో ఉంటేనే సంపూర్ణ పౌష్టికాహారం తీసుకున్నట్టని పేర్కొన్నారు. పౌష్టికాహారం ఆవశ్యకత గురించి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కిశోర బాలికలకే కాక ఆయా కుటుంబాల్లోనే పురుషులకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కుటుంబానికి ఆర్థిక విషయాల్లో ముఖ్య భూమిక పోషించే మగవాళ్లకు పోషణ విషయంపై అవగాహన ఉంటే అందుకు అనుగుణంగా ఆహారంపై ఖర్చు చేయడానికి అవకాశం ఉందన్నారు. ఆయా అంగన్వాడి కేంద్రాల పరిధిలోని ఉండే గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం నుంచి సరఫరా చేసే పాలు, గుడ్లు, ఇతరత్రా ఆహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. గర్భంలోని బిడ్డ ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో ముఖ్యమని, సరైన పోషణ ఉంటేనే ఆ బిడ్డ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా పెరుగుతుందన్నారు.
గతేడాది యూనిసెఫ్ నివేదిక ప్రకారం మన జిల్లాలో తక్కువ బరువుతో శిశువులు జన్మించడం జరిగిందని గుర్తు చేస్తూ, జిల్లాలో శిశు మరణాలు సంభవించకుండా పౌష్టికాహార ఆవశ్యకత గురించి ఒక్క నెలలోనే కాదు ఏడాదంతా తరచూ అవగాహన కల్పించాల్సిన బాధ్యత అంగన్వాడి కేంద్రాల కార్యకర్తలు, ఆయాలపై ఉందన్నారు. ప్రతి చిన్నారి పోషణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, నెలవారీగా శిశువుల బరువు, ఎత్తు తెలుసుకుంటూ వారికి అవసరమైన ఫీడింగ్ అందజేయాలన్నారు. మన సమాజంలో నేటికీ బాలింతలు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోరాదనే అపోహలు ఉన్నాయని, కానీ వైద్యుల సూచన ప్రకారం పౌష్టికాహారంతో కూడిన బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం అత్యంత ఆవశ్యకమన్నారు. చిన్నారులకు కనీసం ఆరేళ్ల వయసు వరకు అందించే పౌష్టికాహారం వారి ఆరు దశాబ్దాల జీవితానికి ఉపయోగపడుతుందని తెలియజేశారు. ప్రతి ఉద్యోగి నిబద్ధతతో పని చేస్తూ చిన్నారులకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందేలా కృషిచేయాలన్నారు. ఫలితంగా భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించే గొప్ప పౌరులను సమాజానికి అందించిన వారవుతారన్నారు.
అనంతరం కలెక్టర్, ఇతర అధికారులు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం, శిశువులకు అన్నప్రాసన, గర్భిణీలకు సామూహిక సీమంతం కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పోషణ ఆవశ్యకతను వివరించే గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పోషణ గురించి, డ్రగ్స్ నివారణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సునంద, డిఎంహెచ్ఓ డాక్టర్ సిద్ధప్ప, డిప్యూటీ డిఎంహెచ్ ఓ సంధ్య కిరణ్మయి, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీధర్, డిఆర్డిఎ ఏపిడి శ్రీనివాసులు, డిపిఎం సలోమి, బాలల సంరక్షణ అధికారి నరసింహ, ఐసిడిఎస్ అధికారులు, అంగన్వాడి కార్యకర్తలు, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.