డిజిటల్ అరెస్టులపై నివ్వెరపోయిన సుప్రీంకోర్టు
కేంద్రానికి, సీబీఐకి నోటీసులు
తదుపరి విచారణ 27న
న్యూఢిల్లీ : డిజిటల్ అరెస్టుల కేసులు పెరిగిపోతుండడం పట్ల సుప్రీం కోర్టు శుక్రవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నేరస్తులు తమను లా ఎన్‌ఫోర్స్‌మెంట్ లేదా జ్యుడీషియరీ అధికారులుగా చెప్పుకుంటూ ఫోర్జరీ చేసిన కోర్టు ఉత్తర్వులతో సైబర్ నేరాలకు పాల్పడుతూ డిజిటల్ అరెస్టు పేరుతో సాగిస్తున్న కుంభకోణాల సమస్యను సుమోటోగా పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం దీనిపై కేంద్రం, సిబిఐ, హర్యానా ప్రభుత్వాల నుండి స్పందనలను కోరింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసింది. 27న తదుపరి విచారణ చేపట్టేలోగా దర్యాప్తు స్థితిగతులపై నివేదికను అందచేయాల్సిందిగా ఆదేశించింది. హర్యానాలోని అంబాలాకు చెందిన 70ఏండ్ల మహిళ రాసిన లేఖ నేపథ్యంలో కోర్టు జోక్యం చేసుకుంది. సీబీఐ, ఈడీ, జ్యుడీషియల్ అధికారులమని చెప్పుకోవడం ద్వారా కొంతమంది నేరస్తులు తనను, తన భర్తను డిజిటల్ అరెస్టు చేసి దాదాపుగా కోటిన్నర రూపాయిలు కాజేయడాన్ని ఆమె ఆ లేఖలో వివరించారు.
ఫోన్, వీడియో కాల్స్ ద్వారా ఆ నేరస్తులు ఆ వృద్ధ జంటను బెదిరించారు. ఫోర్జరీ చేసిన సుప్రీం కోర్టు ఉత్తర్వులను చూపించారు. తద్వారా తమ జీవితకాలంలో దాచుకున్న మొత్తాలను వివిధ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసేలా ఒత్తిడి తీసుకవచ్చారని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో అంబాలా సైబర్ క్రైమ్ బ్రాంచ్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. సాధారణ పరిస్థితుల్లో అయితే దర్యాప్తును వేగవంతం చేయాల్సిందిగా మాత్రమే రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం వుండేదని, కానీ ఈ కేసులో సుప్రీం కోర్టు పేరుతో అనేక బూటక జ్యుడీషియల్ పత్రాలను ఆ మోసగాళ్ళు సంపాదించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాల్యా బాగ్చిలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది.
బ్యాంక్ ఖాతాలను స్తంభింప చేయడానికి మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద జారీ చేసిన ఉత్తర్వులు కూడా ఇందులో వున్నాయని బెంచ్ పేర్కొంది. అలాగే ముంబయి ఇడి అధికారి హోదాలో ఫోర్జరీ చేసిన సీల్‌ను కలిగివున్న అరెస్టు ఉత్తర్వులను, ఫోర్జరీ చేసిన జ్యుడీషియల్ అధికారుల నిఘా ఉత్తర్వులను కూడా వారు చూపించడం పట్ల కోర్టు నివ్వెరపోయిందని బెంచ్ పేర్కొంది. ఇలాంటి దారుణాలు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులను వారు లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. దీనిపై సమన్వయంతో కూడిన జాతీయ స్థాయి స్పందన అవసరమని బెంచ్ నొక్కి చెప్పింది. దేశవ్యాప్తంగా కఠిన కార్యాచరణ వుండాలని అభిప్రాయపడింది. ఇందుకు గానూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల పోలీసు అధికారులు సంఘటితంగా కృషి చేయాలని పేర్కొంది. అప్పుగే ఈ నేరస్తుల పూర్తి స్థాయి పన్నాగాలను తుదముట్టించగలమని పేర్కొంది.