Saturday, October 18, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఓ మైగోల్డ్‌

ఓ మైగోల్డ్‌

- Advertisement -

తులం బంగారం ధర రూ.1.35 లక్షలు
ఏడాదిగా పెరుగుతూనే ఉన్న ధరలు
ఖరీదుగా మారిన సామాన్యుల సెంటిమెంట్‌
వెండి సైతం అదే దారిలో
కిలో రూ.2 లక్షలకుపైనే
గిరాకీ లేక వ్యాపారుల గగ్గోలు
దీపావళి ధనత్రయోదశి మీదే ఆశలు

నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
భారతీయ సంస్కృతిలో బంగారం ఆభరణాలకు మాత్రమే కాదు.. భద్రతకు, ప్రతిష్టకు ప్రతీక. మహిళలు అపురూపంగా భావించేది. పుట్టినరోజు, వివాహం, ఇతర శుభకార్యాలు.. ఏ సందర్భం అయినా బంగారం తప్పనిసరి అనిపించే విలువను సంపాదించింది. కానీ ప్రస్తుతం బంగారం పేరెత్తినా, దాని ధర విన్నా హడలిపోతున్నారు. ఇటీవల కాలంలో వరుసగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆ ‘మెరుపు’ ఇప్పుడు సామాన్య ప్రజలకు అందని ద్రాక్షలా మారుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, డాలర్‌ బలపడటం, ముడిచమురు ధరల హెచ్చు తగ్గులు, రూపాయి విలువ పడిపోవడం లాంటి పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర క్రమంగా పెరుగుతూనే ఉంది. గతంలో ప్రతి ఏడాది 20 శాతం మేర ధర పెరుగుతూ వస్తుండగా.. ఈ ఏడాది ఏకంగా ధర రెండింతలు కావడం గమనార్హం.

దాంతో సామాన్యులు బంగారం కొనుగోలు చేసే పరిస్థితిలో లేకుండా పోయారు. ప్రస్తుతం పెండ్లిండ్ల సీజన్‌ నేపథ్యంలో.. బంగారం ధర తులం రూ.1.33 లక్షల నుంచి రూ. 1.35 లక్షలకు చేరడంతో నోరెళ్లబెడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బంగారం కొనాలనుకునే మధ్య తరగతి వారు ఆచితూచి కొనుగోలు చేస్తూ ఉన్న వాటితోనే సరిపెడుతున్నారు. హైదరాబాద్‌లో అత్యధికంగా జ్యూవెలరీ షాపులు ఉన్నాయి. ఆ తర్వాత నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, మంచిర్యాల, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ తదితర పట్టణాల్లో ఉన్నాయి. నిజామాబాద్‌ నగరంలో కుమార్‌గల్లి, గంజ్‌ ప్రాంతం బంగారం వర్తక వ్యాపారాలకు పెట్టింది పేరు.

ఇక్కడ సుమారు 150, కామారెడ్డి జిల్లా కేంద్రంలో 75 వరకు బంగారం, వెండి విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడే కాకుండా జిల్లా కేంద్రాలతో పాటు డివిజన్‌, మండల కేంద్రాల్లోనూ వందలాది దుకాణాలు ఉన్నాయి. శుభకార్యాలు, పండుగల వేళల్లో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. పసిడితో వివిధ రకాల డిజైన్‌లలో ఆభరణాలు చేయించుకుంటూ ధరిస్తూ మహిళలు మురిసిపోతుంటారు. గతేడాది ఇదే సమయంలో సుమారు రూ.70 వేలు పలికిన తులం బంగారం ధర.. ఇప్పుడు రెట్టింపైంది. రికార్డు స్థాయిలో పెరుగుదల వినియోగదారులపై, బంగారం వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకప్పుడు పెండ్లిండ్లు, పండుగలు, పూజలు ఉంటే ఎంతో కొంత కొనుగోలు చేసే వారు సైతం తర్వాత చూద్దామంటూ బంగారానికి ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు.

కొనుగోలు శక్తి తగ్గింది..
బంగారం ధరల పెరుగుదలతో సాధారణ ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిపోయింది. గతంలో పెండ్లి కోసం మధ్య తరగతి కుటుంబాలు కనీసం 10 తులాలు కొనుగోలు చేసేవి. ప్రస్తుత ధరలతో 4 నుంచి 5 తులాలకే పరిమితం అవుతున్నారు. ఈ ధరల వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారులు కూడా ‘ఇప్పుడు డిమాండ్‌ కంటే విచారణలు ఎక్కువగా వస్తున్నాయి. కస్టమర్లు వస్తున్నారు, ధర అడిగి వెనక్కు వెళ్లిపోతున్నారు’ అంటూ గగ్గోలు పెడుతున్నారు. వ్యాపారం సాగక.. దుకాణాల కిరాయిలు సైతం కట్టలేని పరిస్థితికి వచ్చినట్టు వాపోతున్నారు. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారంపైకి మళ్లించడంతో డిమాండ్‌ పెరుగుతూ వస్తున్నట్టు వ్యాపారస్తులు చెబుతున్నారు. బంగారంపై పెట్టుబడి.. సురక్షిత పెట్టుబడిగా భావిస్తుండటంతో అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయి. దాంతో స్థానికంగా దాని ప్రభావం చూపిస్తుంది.

‘వెండి’కి సైతం లక్షల్లో ‘విలువ’
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2 లక్షలకు చేరడం గమనార్హం. గతంలో ఏదైనా శుభకార్యాలకు వెళ్తే.. దగ్గరి బంధువులకు వెండితో తయారు చేసిన గిఫ్టులు ఇస్తుండేవారు. దాని ధర సైతం ప్రియం కావడంతో కొనేందుకు జంకుతున్నారు. గతంతో పోలిస్తే.. కేవలం 10 శాతం మాత్రమే వ్యాపారాలు సాగినట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దీపావళి మీదే ఆశలు పెట్టుకున్నారు. పండుగకు ముందు వచ్చే ధనత్రయోదశి (ధంతరాస్‌) శనివారం వస్తుందని.. ఆ రోజు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తారేమోనని వ్యాపారులు ఎదురుచూస్తున్నారు.

రెండు నెలల్లోనే 30 శాతం పెరిగిన ధర: లక్ష్మికాంత్‌, నిజామాబాద్‌ గోల్డ్‌ అండ్‌ సిల్వర్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు
గతంలో సాధారణంగా ఏడాదికి 20 శాతం మేర బంగారం ధర పెరిగేది. కానీ ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితులతో ధర అమాంతంగా పెరుగుతోంది. ఈ రెండు నెలల్లోనే 30 శాతం పెరిగింది. సామాన్యులు పండుగలకు ఎంతో కొంత కొనేవారు. ప్రస్తుతం రూ.1.35 వేలకు చేరువలో ఉండడంతో కొనుగోలు చేసేందుకు వెనకాముందు అవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -