యూనివర్సిటీలకు బడ్జెట్ పెంచాలి : వక్తలు
యూనివర్సిటీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 3వ మహాసభ
35 మందితో రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని యూనివర్సిటీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 3వ మహాసభలో వక్తలు డిమాండ్ చేశారు. ఓయూలోని మహమ్మద్ ఉస్మాన్‌నగర్‌లో తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 3వ మహాసభ ఘనంగా జరిగింది. మెట్టు రవి, పద్మశ్రీ, మహేందర్ అధ్యక్షతన వహించిన ఈ మహాసభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.పద్మశ్రీ ప్రారంభ ఉపన్యాసం చేశారు. మెట్టు రవి జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నత విద్యారంగాన్ని పూర్తిగా ప్రయివేటీకరించడానికి ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
2025-26 బడ్జెట్‌లో ఉన్నత విద్యకు సరిపడా కేటాయింపులు చేయకపోవడం అన్యాయమన్నారు. యూజీసీ నిబంధనలను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా సడలించడం, యూనివర్సిటీలకు గ్రాంట్లు సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యా వ్యవస్థను బలహీనపరుస్తోందన్నారు. అలాగే, కార్మిక హక్కులను హరించేందుకు కార్మిక చట్టాలను ఎత్తేసి నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేబర్ కోడ్‌ల రద్దు కోసం భవిష్యత్‌లో దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.నారాయణ మూడేండ్ల నివేదికను ప్రవేశపెట్టారు. యూనివర్సిటీలలో పనిచేస్తున్న నాన్-టీచింగ్ సిబ్బందికి కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలని, ఔట్‌సోర్సింగ్ కార్మికులను కాంట్రాక్ట్ పద్ధతిలో, కాంట్రాక్ట్ ఉద్యోగులను టైమ్ స్కేల్ పద్ధతిలో నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యూ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేయాలని కోరారు.
యూనియన్ గౌరవాధ్యక్షులు జె.వెంకటేష్ మాట్లాడుతూ.. కనీస వేతనాల పెంపుదల కోసం ఆందోళనలు, పోరాటాలు ఉధృతం చేయాలని, నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా నిరంతరం క్యాంపెయిన్ చేయాలని సూచించారు. స్థానిక సమస్యలపై అన్ని యూనివర్సిటీలలో పోరాటాలు నిర్వహించాలని, మహిళా కార్మికుల సమస్యలపై ప్రత్యేక కేంద్రీకరణతో పని చేయాలని, యంగ్ వర్కర్స్ అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ద పెట్టాలని అన్నారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, మహిళలపై హింసను అరికట్టాలని, ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధం ఆపాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్న నాలుగు తీర్మానాలను కె.చిరంజీవి, ఎం.దశరథ్, ఎం.పద్మశ్రీ, మహేందర్ ప్రవేశపెట్టగా మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభలో వివిధ యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.
నూతన రాష్ట్ర కమిటీ
మహాసభ సందర్భంగా యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా కె.వెంకటేష్, అధ్యక్షులుగా మెట్టు రవి, ప్రధాన కార్యదర్శిగా వి.నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎం.పద్మశ్రీ, కోశాధికారిగా పి.మహేందర్, ఉపాధ్యక్షులుగా కె.చిరంజీవి, మహమ్మద్ సలార్, అమీర్, రాగుల రమేష్, కార్యదర్శులుగా ఎం.దశరథ్, డి.జగదీష్, వి.సరిత, రమేష్‌తో పాటు 35 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పడింది.
నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES