పూర్తి అవగాహనతో విధులకు వెళ్లాలి: జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి.కర్ణన్
పీఓ, ఏపీఓ, ఓపిఓల శిక్షణ కార్యక్రమం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎన్నికలలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్, ఓపిఓలది కీలకపాత్ర అని, వారు విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన పెంచుకుని ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి.కర్ణన్ అన్నారు. పోలింగ్ సమయంలో తటస్థంగా ఉండాలన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో శనివారం బంజారహిల్స్ బంజారా భవన్‌లో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలకు మొదటి విడత శిక్షణ నిర్వహించారు. పోలింగ్ రోజు విధులు, బాధ్యతలపై జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ఎన్నికల విధులను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రం లోపల, వెలుపల కార్యకలాపాల నిర్వహణ, ఎన్నికల అధికారులు చేయాల్సినవి, చేయకూడని అంశాలను వివరించారు. ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ రోజు ముఖ్యమైందని, అన్ని అంశాలపై ఎన్నికల సంఘం రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవడమే కాకుండా, అందులోని అన్ని నిబంధనలను తూ.చా తప్పకుండా పాటించాలని సూచించారు.
పోలింగ్ ముందు రోజు చేయాల్సిన పనులను చెక్‌లిస్టు తయారు చేసుకొని విధులు నిర్వహించాలని చెప్పారు. ముఖ్యంగా ప్రతి పోలింగ్ ఆఫీసర్ తీసుకోవాల్సిన మెటీరియల్, ఈవీఎంల నిర్వహణ, పీఓ, ఏపీఓ డైరీ, వారి విధులు, పోలింగ్ కేంద్రం బయట ప్రదర్శించాల్సిన సామాగ్రి, పోలింగ్ కేంద్రంలోకి అనుమతించే వారు, మాక్ పోల్, ఈవీఎం, వివి ప్యాట్‌లను ఎలా అనుసంధానం చేయాలి వంటి అన్ని విషయాలు ఒకటికి రెండుసార్లు చదివి పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. పోలింగ్ రోజు ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఈవీఎం అనుసంధానం, మాక్ పోలింగ్ తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్‌లు అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సునంద, మమత, 2,300 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు.