Monday, October 20, 2025
E-PAPER
Homeదర్వాజజీవన సారాంశం ఎన్‌.అరుణ కవిత్వం

జీవన సారాంశం ఎన్‌.అరుణ కవిత్వం

- Advertisement -

నివాళి

తెలుగు సాహిత్యంలో సాధికారకమైన స్వీయగొంతుకతో విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న కవయిత్రుల్లో శ్రీమతి ఎన్‌.అరుణ ఒకరు. 1976 అక్టోబర్‌లోనే తొలి కవిత ప్రచురణ పొందినా, శ్రీమతి అరుణ విరివిగా కవితారచన చేసిన కాలం మాత్రం 2004 నుండి 2012 వరకు. ”యాభైఐదేళ్ళలో/ నేను నేర్చుకున్న పాఠం/ ఎప్పుడెప్పుడు/ మౌనంగా ఉండాలో” అంటూ జీవన తాత్త్వికతను పలికిస్తూ యాభైఐదేళ్ళ వయసులో మొదటి కవితాసంపుటి ‘మౌనం మాట్లాడుతుంది’ (2004) ప్రకటించారు. ఆ తరువాతి ఎనిమిదేళ్ళ కాలంలో – పాటలచెట్టు (2005), గుప్పెడుగింజలు (2006), అమ్మ ఒక మనిషి (2007), హదయమే వదనం (2008), సూది నా జీవనసూత్రం (2009), నిరీక్షణే ఒక గాయం (2012) – ఏడు కవితాసంపుటాలను వెలువరించారు.

ఏళ్ళకేళ్ళుగా తనలో గూడుకట్టుకుంటున్న వేదనకు, ఆలోచనలకు, అలజడులకు – సామాజిక సమస్యలకు, సంఘర్షణకు, మానవవేదనకు ఉన్న అభేదాన్ని గ్రహించారు. వైయక్తిక చేతనకు, సామూహిక చేతనకు కవిత్వాన్ని వేదికగా చేసుకున్నారు. అరుణ కవిత్వం సామాజిక జీవితంలోని అనేక పార్శ్వాలను, మానవ జీవితంలోని సమస్త సంవేదనలను స్పృశిస్తూ సాగిపోతుంది. ఆమె తన కవిత్వంలో బాహ్యజీవితానికి ఎంత చోటిచ్చారో, మనిషి ఆంతరంగిక జీవితానికీ అంతే ప్రాముఖ్యతనిచ్చారు. అందుకే ఆ కవిత్వంలో ఆగ్రహమూ కనిపిస్తుంది. నిగ్రహమూ కనిపిస్తుంది. ఆ రెంటినీ సమన్వయపరిచే సంయమనమూ కనిపిస్తుంది. కవితల్ని ముట్టుకుంటే మనిషిని తాకుతున్నట్లే ఉంటుంది. చదువుతుంటే పఠితలో మానవీయ స్పృహను తట్టిలేపుతుంది. ఐతే ఈ గుణాలన్నీ కేవలం పరిణత వయసులో రాయడం వల్లనే వచ్చిందంటే సరికాదేమో. జీవన ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలు చవిచూసి, జీవిత రహస్యాల్ని అవగతం చేసుకుని, నిండైన వ్యక్తిత్వంతో, పరిణత మనసుతో చేసిన కవిత్వసజన అని చెప్పాలి. ఆలస్యంగా మొదలుపెట్టినా, కొద్దికాలమే రాసినా అరుణ చేసిన కవిత్వసాగు పక్వఫలాలనే అందించింది.

”అమ్మ కనుకొనుకుల్లో దాగిన/ గోర్వెచ్చని లాలన ముందు/ కదలిరాని దైవం ఎంత?” అమ్మతనాన్ని ఉన్నతంగా ఆవిష్కరించిన అరుణ కవిత్వం, వ్యక్తిత్వం అమ్మమనసుతోనే అలరారింది. అందుకే చెత్తకాగితాలు ఏరుకుని జీవించే అనాథ బాలుణ్ణి చూసి ”అమ్మకోసం ఇంత పెద్ద ప్రపంచాన్ని జల్లెడ పడుతున్నవాడికి నేనే అమ్మను కావాలనుంది” అనగలిగారు. మైకేల్‌ జాక్సన్‌ మరణించినప్పుడు ”కానరాని లోకాలకు కదలిపొయ్యావా జాక్సన్‌ ఓ మై సన్‌” అని ఒక తల్లిలా తల్లడిల్లారు. అదే సమయంలో అమ్మను, అమ్మతనాన్ని నిర్లక్ష్యం చేస్తున్న సమాజానికి ”అమ్మను దేవతను చేయకండి మిత్రులారా, మనిషిగా గుర్తిస్తే చాలు” అంటూ అమ్మలా చురకలంటించారు.

”ఆ మనస్సు అర్థం కాని బ్రహ్మపదార్థమేమి కాదు/ అర్థం చేసుకోవడం ఇష్టం లేదంతే” మహిళను మానవీయ హదయంతో సమగ్రంగా అర్థం చేసుకోగలిగినప్పుడే స్త్రీ సాధికారికత, సమానత్వం సాధ్యమవుతుందని సమాజానికి విన్నవించిన అరుణ ”నువ్వు అణచివేతవైతే/ నేను ఉద్యమాన్నవుతా/ నువ్వు ఆధిపత్యమైతే/ నేను పోరాటమవుతా/ నువ్వు విత్తును నాటితే/ నేను మొలకనయ్యేదానిని/ కాని నిప్పును నాటుతున్నావు/ అగ్నిజ్వాలనై లేస్తా” అంటూ స్త్రీవాద సాహిత్యానికి కొత్తచేవను అందించారు. లోతైన జీవన తాత్త్వికతతో, సున్నితమైన భావుకతతో సాగిపోయే ”మనసులో వెలిగే/అపురూప చైతన్యదీపాన్ని/నిరంతరం కాపాడుకోవటమేగా/జీవితమంటే”, ”సున్నితపు త్రాసులో /ఒకవైపు సముద్రం/మరోవైపు కన్నీటిచుక్క/మొగ్గు రెండోవైపే” మొదలైన నిరాడంబర కవితావాక్యాలు అరుణ వ్యక్తిత్వాన్ని పట్టిచూపుతాయి.

స్పష్టత, పారదర్శకత ఆమె కవిత్వానికి రెండు కళ్ళు. ”ఒకప్పుడు ఒక వరికంకిలో గింజలను లెక్కపెట్టి/ ఎన్ని పుట్లు పండుతాయో చెప్పగలిగిన కృషీవలుడు/ ఇప్పుడు గడ్డితో ఉరితాడు పేనుకుంటున్నాడు!/ ఇది ఆత్మహత్య కాదు/ కొన్ని నెలల క్రితమే జరిగిన హత్య/ ఇవాళ అసెంబ్లీలో జరుగుతున్నది మాత్రం/ దారుణమైన పంచనామా” అరుణకున్న సామాజిక స్పృహకు, చైతన్యానికి ఈ కవిత చక్కని చిరునామా. ”లోకానికి అక్షరాలు అప్పుపడ్డాను, అందుకే కవిత్వం రాస్తున్నా” అంటూ ఏడెనిమిదేళ్ళలోనే తను తీర్చాల్సిన అప్పునంతా తీర్చేశారు. ఇప్పుడేమో మనల్ని వీడి తరలిరాని లోకాలకు పోయారు. అయినా అరుణ కవిత్వంగా చిరంతనం వెలుగులీనుతూనే ఉంటారు. తెలుగు కవితా ప్రపంచానికి ఆమె అందించిన సున్నితమైన, మానవీయ చేర్పును అందిపుచ్చుకుందాం. అదే ఆమెకు మనమివ్వగల ఘననివాళి.

  • రాపోలు సీతారామరాజు
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -