మరిన్ని రాజకీయ అవకాశాలు కల్పిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ ప్రాతినిథ్యంలో యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీకృష్ణ సదర్ సమ్మేళనాన్ని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సీఎంకు డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరవాత సదర్‌ను రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని కోరిన వెంటనే దానికి అంగీకరించామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ యాదవులకు రాజకీయ అవకాశాలు కల్పించిందని సీఎం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులోకి రావడంలో యాదవులది అత్యంత కీలకమైన పాత్ర అని చెప్పారు.
వారికి మరిన్ని అవకాశాల కోసం పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి యాదవుల సహకారం కావాలని కోరారు. యాదవుల సహకారంతో హైదరాబాద్‌లో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయనీ, పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నట్టు తెలిపారు. యాదవరాజులు పాలనా కాలం నుంచి హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారని సీఎం గుర్తుచేశారు. ఏ కష్టం వచ్చినా నమ్మినవారికి అండగా ఉండటం యాదవుల లక్షణం అని కొనియాడారు. యాదవులకు మరిన్ని రాజకీయ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తప్పకుండా వాటిని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచందర్‌రావు, కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.