– కేరళలో భారీ వర్షాలు ొ నేడు విద్యా సంస్థలకు సెలవు
– తమిళనాడు, దక్షిణాది ప్రాంతాల్లోనూ వానలు
– చెన్నైలో పలు కాలనీలు జలమయం
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం స్టాలిన్ ఆదేశం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
నైరుతి రుతుపవనాలు తగ్గుముఖం పట్టినా.. ఆగేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, కేరళతో పాటు దక్షిణాది తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతం మధ్య భాగాలలో మరింత తీవ్రమై వాయుగుండంగా మారనుందని వాతావరణశాఖ (ఐఎండీ) భావిస్తోంది. కేరళలోని ఐదు జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లతో హెచ్చరికలు జారీచేసింది.
తిరువనంతపురం : కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమ, మంగళవారాల్లో 10 జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్‌ల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాల కారణంగా వరదలు, చెట్లు కూలిపోవడం, ట్రాఫిక్ అంతరాయం.. వంటి ఇబ్బందులు ఏర్పాడ్డాయి. కన్నూర్‌లోని చెరువుపుళలో ఆకస్మిక వరదలు సంభవించి రెండు ఇండ్లు, ఒక వ్యాపార సంస్థ మునిగిపోయాయి. ప్రాపొయిల్ వద్ద ఓ ఇంటిపై కాంపౌండ్ గోడ కూలిపోయింది. బుధవారం కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 48 గంటల్లో కేరళపై ఈశాన్య రుతుపవనాలు తీవ్ర ప్రభావం చూపించనున్నాయని తెలిపింది. ఇడుక్కి, పాలక్కడ్, మలప్పురం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు బుధవారం సెలవు ప్రకటించారు. అలాగే పతనం తిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, కోజికోడ్, వాయునాడ్ జిల్లాలకు భారత వాతావరణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్డ్ ప్రకటించారు. అలాగే, భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికతో పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లోని అన్ని విద్యా సంస్థలకు బుధవారం సెలవు ప్రకటిస్తూ పుదుచ్చేరి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడులోనూ ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. విల్లుపురం, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, తిరువళ్లూరు, తంజావూరు, పుదుకొట్టై, రామనాథపురం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, కళ్లకురిచ్చి, అరియలూర్, పెరంబదూర్, తూత్తుకుడి, తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేశారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. సంబంధిత జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. బాధిత ప్రజల కోసం సహాయ శిబిరాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఆహారం, తాగునీరు, మందులతో సహా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే, జేసీబీ యంత్రాలు, పడవలు, మోటారు పంపులు, ట్రక్కులు, రంపాలు వంటి అవసరమైన పరికరాలతో బృందాలు సిద్ధంగా ఉంచాలని స్టాలిన్ సూచించారు.
చెన్నై జలమయం .. సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం స్టాలిన్ ఆదేశం
చెన్నైలో వరుణుడు దడ పుట్టిస్తున్నాడు. చెన్నై సమీపంలోని వెలాచెరీ, మేడవక్కం, పల్లికరనారుతో పాటు ఈసీఆర్ నీలంకారీ ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. భారీ వర్షం కారణంగా పలు కాలనీలు జలమయమయ్యాయి. తూతుకూడిలో నాలుగు రోజులుగా నిత్యం వర్షం కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. పలు కాలనీల్లో వరద నీరు చేరడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే వీలుందని, దీని ప్రభావంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈశాన్య రుతుపవనాల కారణంగా సంభవిస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగం, రాష్ట్ర అత్యవసర సేవల విభాగాలు సంసిద్ధంగా ఉండాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులను ఆదేశించారు.
తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం
ఆగేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రవాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్, ఒడిషాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఒడిషాలోని బాలసోర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రపారా, కటక్, జగత్‌సింగ్‌పూర్, పూరి, ఖుర్దా, నయాగ, గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, మాల్కాన్‌గిరి జిల్లాలోని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.