రాత్రివేళల్లో గద్దల్లా వాలుతున్న ఇసుక మాఫియా
అనుమతులు లేకున్నా అక్రమంగా తవ్వకాలు
దుందుభి ఖాళీ..
నదిలో మొలుస్తున్న అడవిగడ్డి
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
నదుల్లో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.. ఇసుక మాఫియా రాత్రి వేళల్లో పాగా వేసి తోడేస్తూంది. రాష్ట్ర రాజధానికి రవాణా చేస్తున్నారు.. ఇంత జరుగుతున్నా మైనింగ్ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో దుందుభి నది ఖాళీ అవుతోంది.. దుందుభి నుంచి హైదరాబాద్ వయా కడ్తాల్ మీదుగా రాత్రంతా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇసుక ఖాళీ కావడంతో భూగర్భజలాలు తగ్గిపోయి సాగు భూములకు నీరు అందడం కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో దుందుభి నదిలో ఇసుక మేటలు అధికంగా ఉన్నాయి. దాసర్లపల్లి, ఉప్పునుంతల, రఘుపతిపేట, పొల్మూరు పరిధిలో ఉండే ఇసుక మేటలపై అక్రమార్కుల దృష్టి పడింది. ప్రధానంగా ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి గ్రామ సమీపంలో ఉండే ఇసుక తరలించడానికి కొందరు రోడ్డు నుంచి నది వరకు మట్టి రోడ్డు వేశారు. అక్కడి నుంచి ఇసుక తరలిస్తున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా 12 టైర్ల బండ్లతో తరలిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గతంలో 20 ట్రిప్పుల ఇసుక కోసం ఒక ఆర్డర్ పేపర్ తెచ్చుకున్నారు. దాని సమయం ముగిసినా తహసీల్దార్ వద్ద గడువు పెంచుకున్నారు. మూడు నెలల నుంచి ఒకే ఆర్డర్ పేపర్ చూయిస్తూ ఇసుకను తరలిస్తున్నారు. దాసర్లపల్లి నుంచి హైదరాబాద్‌కు, నాగర్‌కర్నూల్ పరిధిలోని పలు గ్రామాలల్లో జరుగుతున్న నిర్మాణాలకు ఇసుకను సరఫరా చేస్తున్నారు. దాంతోపాటు మైనింగ్‌పైనా అక్రమార్కుల దృష్టి పడింది. గుట్టలు కరిగిపోతున్నాయి. తెలకపల్లి మండలం రామగిరి దేవాలయానికి సంబంధించిన గుట్ట నుంచి మట్టిని కొందరు పెద్దఎత్తున తరలిస్తున్నారు. ఇలా భూత్పూరు, కోయిల్‌సాగర్, వట్టెం, పొతారెడ్డిపల్లి, తాడూరు మండల పరిధిలో ఉండే గుట్టలన్నీ మాయమౌవుతున్నాయి.
బోరు బావులు ఎండిపోయే అవకాశం
దుందుభీ నది నుంచి ఇసుక తోడెయ్యడంతో పరివాహక ప్రాంతంలో బోరుబావులు ఎండిపోయే అవకాశాలున్నాయి. 30 అడుగుల వరకు ఇసుక మేటలు ఉంటే.. 25 అడుగుల వరకు నీళ్లు ఉండేవి.
ఇసుక తరలించడం వల్ల నీటి నిల్వ లేకుండా పోతున్నది. దుందుబీ నది ద్వారా మొత్తం 90 వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఇసుక ఉంటే బుర్రజెమ్మెడి, లొట్టపీసు చెట్లు మాత్రమే మొలిచేవి.. ఇసుకను తోడెయ్యడం వల్ల అడవిగడ్డితోపాటు కంప చెట్లు, వేప, తుమ్మ, ముళ్లపొదలతో నది నిండిపోతోంది. ఇసుక అక్రమ తరలింపుపై సంబంధిత అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. వెళ్లి హడావుడి చేసి వస్తున్నారు తప్పితే తగిన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు పెద్దఎత్తున వస్తున్నాయి. ఇదంతా లారీ యజమానులు, అధికారుల కుమ్మక్కు వ్యవహారమన్న ఆరోపణలొస్తున్నాయి.
ఇసుక అక్రమాలను అరికట్టాలి : రైతు సంఘం నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులు సి.బాల్‌రెడ్డి
దుందుభీ నది నుంచి ఇసుక తరలించడం వల్ల ఈ ప్రాంతం మరో సొమాలియగా మారుతున్నది. ముఖ్యంగా నీటి ఆధారంగా సాగు చేసే వరి, పల్లి, మొక్క, మిర్చి పంటలకు సాగునీటి సమస్య ఏర్పడుతుంది. ఇసుక అక్రమ రవాణాపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు :ఉప్పునుంతల ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి
మండల పరిధిలో ఇసుక అక్రమ తరలింపుపై మా దృష్టికి వచ్చింది. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటాం. అనుమతులు ఉంటేనే ఇసుక రీచ్‌లకు వెళ్లాలి. పర్మిషన్ తీసుకోని వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవు.
ఇసుక ఉంటేనే నీరు
మేము ఈ దుందుభిó నది నీటి ఆధారంగా జీవిస్తున్నాం. నదిలో నీళ్లు ఉంటేనే పంటలు పండుతాయి. అక్రమంగా ఇసుక తరలించడం వల్ల నీరు అడుగంటి భూములు బీడుబారే అవకాశం ఉంది. ఇసుక తవ్వకాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. పంట పొలాలకు సాగునీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. – హరీష్, రైతు, రఘుపతిపేట, కల్వకుర్తి మండలం
దుందుభిపై అక్రమార్కుల కన్ను
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES