జీపీ కార్మికులకు అమలు కాని కనీస వేతనాలు
మల్టీపర్పస్ వర్కర్లకు ఇస్తున్నది రూ.9,500 మాత్రమే..
అదీ ఎప్పుడిస్తారో తెలీదు
ఆన్‌లైన్‌లో ఆరువేల మంది పేర్లు లేవు
51 జీవో రద్దుపై మీనమేషాలు
రెండో పీఆర్సీలో చేర్చాలని డిమాండ్
‘కనీస వేతనాలు అమలు చేస్తాం.. ప్రాణాలు తీస్తున్న మల్టీపర్పస్‌కు సంబంధించిన జీవో 51 రద్దు చేస్తాం..అందర్నీ ఆన్‌లైన్‌లో ఎక్కించి వేతనాలు దక్కేలా చూస్తాం ‘ అంటూ అధికార పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇంకా పట్టాలెక్కలేదు. అవన్నీ పరిశీలన దశలోనే ఉన్నాయి. టీఎస్ బీపాస్ ద్వారా వేతనాలు విడుదలవుతున్నప్పటికీ ప్రతి నెలా జీతం ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూడాల్సిన పరిస్థితి. రెండో పీఆర్సీలో చేర్చి కనీస వేతనాలు ఇవ్వాలనే డిమాండ్‌తో పంచాయతీ కార్మికులు నిరంతరం పోరాటాలు చేస్తున్నా రాష్ట్ర సర్కారు పట్టించుకోవట్లేదు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామ పంచాయతీల్లో 56 వేల మందికిపై మల్టీపర్పస్ వర్కర్లు పనిచేస్తున్నారు. అందరి పేర్లను ఆన్‌లైన్‌లో ఎక్కిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీనిచ్చింది. వారిలో 49,460 మందిని మాత్రమే ఆన్‌లైన్‌లో ఎక్కించింది. టీజీ బీపాస్ ద్వారా వారికి వేతనాలు అందుతున్నాయి. ఇంకా ఆరువేల మంది పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. హన్మకొండ జిల్లా ఉప్పల్ పంచాయతీలో 10 మంది కార్మికుల పేర్లు ఇంకా ఆన్‌లైన్‌లో ఎక్కలేదు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో 32 మంది పేర్లు ఎక్కలేదు. వారికి పది నెలల నుంచి వేతనాలు అందట్లేదు. జగిత్యాల జిల్లాలో 50 మంది పేర్లు ఎక్కలేదు. వేతనాలు పంచుకునే దగ్గర ఆన్‌లైన్‌లో ఎక్కిన, ఎక్కని కార్మికుల మధ్య గొడవలు జరుగుతున్న పరిస్థితి. కొన్ని చోట్ల అధికారులే ఆన్‌లైన్‌లో ఎక్కని వారు పనులకు రావొద్దని మొహం మీదనే చెబుతున్నారు. ఇన్నేండ్లు పనిచేశాక, ఇప్పుడు తమను బయటకు వెళ్లిపోమంటే ఎలా బతకాలని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపాల్సిన అవసరముంది.
మల్టీపర్పస్ కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీనిచ్చింది. అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా ఇంకా ఆ హామీ పట్టాలెక్కలేదు. తమను రెండో పీఆర్సీ పరిధిలో చేర్చి కనీస వేతనం ఇవ్వాలని గ్రామపంచాయతీ కార్మికులు సుధీర్ఘ కాలంగా పోరాటాలు చేస్తున్నారు. వారికి కనీస వేతన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కారుపై ఉంది. ఇన్సూరెన్స్‌ను వర్తింపజేస్తామని మంత్రి సీతక్క, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషన్ పలుమార్లు హామీలిచ్చినా ఇంకా అమలు చేయడం లేదు. దీన్నీ పరిష్కరించాల్సిన అవసరముంది. లరాష్ట్రంలో మల్టీపర్పస్ పనివిధానం అనేక మంది పంచాయతీ కార్మికుల చావులకు కారణమవుతున్నది. ట్రాక్టర్లు నడపటంపై అవగాహన లేక, విద్యుత్ స్తంభాలపై లైట్లు వేసే పని రాక వందకుపైగా కార్మికులు చనిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆ పనివిధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్ బలంగా ఉంది.
ఇదే అంశంపై సీఐటీయూ బృందం పలుమార్లు మంత్రి సీతక్కను కలిసి విన్నవించింది. జీవో 51 రద్దు చేసే అంశం తమ పరిశీలనలో ఉందని ఆమె చెప్పారు. కానీ ఆ దిశగా చర్యలు మాత్రం లేవు. మల్టీపర్పస్ పనివిధానాన్ని రద్దు చేసి కేటగిరీల వారీగా సిబ్బందిని నియమించాల్సి ఉంది. ఇప్పుడు అన్ని పంచాయతీల్లోనూ 2011 జనాభా లెక్కల ప్రకారం నియమించిన కార్మికులే పనిచేస్తున్నారు. పంచాయతీల్లో జనాభా పెరిగిన నేపథ్యంలో ఆ ప్రకారం కార్మికులను నియమించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని పంచాయతీల్లో పదవీ కాలం చివర్లో వచ్చిన గ్రాంట్లను సర్పంచులు వాడేసుకున్నారు. ఆ కాలానికి సంబంధించి వరంగల్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, తదితర జిల్లాల్లో రెండు, మూడు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి.
అందర్నీ ఆన్‌లైన్‌లో ఎక్కించి కనీస వేతనమివ్వాలి
గ్రామపంచాయతీ కార్మికులందర్నీ ఆన్‌లైన్‌లో ఎక్కించి కనీస వేతనమివ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. మా యూనియన్ రాష్ట్ర ఐదో మహాసభలు ఈ నెల 24,25 తేదీల్లో మహబూబాబాద్ జిల్లా గార్లలో జరుగనున్నాయి. గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల పర్మినెంట్, రెండో పీఆర్సీ పరిధిలోకి తీసుకొని కనీసం వేతనం రూ.26 వేలు అమలు చేయడం, మల్టీపర్ఫస్ వర్కర్ విధానం రద్దు, ఈఎస్‌ఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్ అమలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం భవిష్యత్ కార్యాచరణను మహాసభల్లో రూపొందించుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావొస్తున్నా పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం బాధాకరం. పంచాయతీ కార్మికుల పెండింగ్ డిమాండ్లన్నింటినీ రాష్ట్ర సర్కారు నెరవేర్చేదాకా దశలవారీగా పోరాటాలు చేస్తాం.
పాలడుగు భాస్కర్, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు