పరిష్కారం దిశగా ‘ఇండియా’లో సమస్యలు
లాలూతో అశోక్ గెహ్లట్ భేటీ
నేడు మీడియా సమావేశంలో అన్ని వివరాలు వెల్లడి
పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో ఇండియా బ్లాక్‌లోని పార్టీల మధ్య ఉన్న సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని కాంగ్రెస్ నాయకులు, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ తెలిపారు. ఇండియా బ్లాక్‌లోని ఆర్‌జేడీతో సహా ఇతర పార్టీలతో నెలకొన్న విభేదాలకు పరిష్కరించేందుకు గెహ్లట్ రంగంలోకి దిగారు. ఆర్‌జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్‌తో గెహ్లట్ బుధవారం సమావేశమయ్యారు. ‘బీహార్‌లో ప్రతిపక్ష కూటమి గెలవడం ఎంతో ముఖ్యం. బీహార్ ఎన్నికలు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. సమాజంలో విభజనలకు కారణమై, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్న అధికార ఎన్డీఏను ఓడించాల్సిన అవసరం ఉంది. బీహార్ ప్రజలు ఈ పని చేయగలరు” అని లాలూతో భేటీ అనంతరం గెహ్లట్ మీడియాతో మాట్లాడారు. గురువారం మీడియా సమావేశం నిర్వహించ నున్నామని, అన్ని ప్రశ్నలకు ఈ సమావేశం సమాధానం చెబుతామన్నారు.
అలాగే, ‘రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ మధ్య మంచి అనుబంధం ఉంది. బీహార్‌లో ఇటీవల నిర్వహించిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో ఇది నిరూపితమైంది. ఇరు నేతలు రాష్ట్రమంతా పర్యటించారు. వారు సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారు’ అని కూడా గెహ్లట్ తెలిపారు. నిజానికి ఎన్డీఏ కూటమిలో తమకన్నా ఎక్కువ విభేదాలు ఉన్నాయని విమర్శించారు. ఇండియా బ్లాక్ పార్టీల మధ్య సుమారు 10 సీట్లలో స్నేహపూర్వక పోటీ ఉండవచ్చని తెలిపారు. ఇలాంటి పోటీలను ఇండియా పార్టీల మధ్య విభేదాలుగా చూడకూదని చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నాటికి సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. బుధవారం లాలూతో సమావేశానికి ముందు తేజస్వి యాదవ్‌తో కూడా గెహ్లట్ సమావేశం జరిపారు.
మంగళవారంతో బీహార్‌లో రెండో దశ ఎన్నికలకు కూడా నామినేషన్ ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీకి దిగింది. ఆర్‌జేడీ 143 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. సీపీఐ తొమ్మిది, సీపీఐ(ఎం) నాలుగు స్థానాల్లో బరిలోకి దిగాయి. ఒకే స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడంతో ఇండియా బ్లాక్‌లో చీలక ఏర్పడిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం జరిగే మీడియా సమావేశంలో అన్ని వివరాలను వెల్లడించ నున్నారు. బీహార్ కాంగ్రెస్ ప్రతినిధి అసిత్ తివారీ మాట్లాడుతూ.. తాము ఎల్లప్పుడూ సంకీర్ణ ధర్మాన్ని అనుసరిస్తామన్నారు. అయితే తేజస్వియాదవ్ ముఖ్య మంత్రి అభ్యర్థిత్వంపై స్పందించడానికి నిరాకరించారు. బీహార్‌లో నవంబరు 6, 11వ తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను అంగీకరిస్తున్నాం : సీపీిఐ(ఎంఎల్)
ఆర్‌జెడి నాయకులు తేజస్వి యాదవ్‌ను ఇండియా బ్లాక్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమోదిస్తున్నామని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య బుధవారం ప్రకటించారు. పాట్నాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇండియా బ్లాక్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలను ఖండించారు. ‘ముఖ్యమంత్రి అభ్యర్థిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుంది. ఎన్నికల్లో ఇండియా కూటమి మెజార్టీ సాధింస్తుందని, తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇందులో ఎటువంటి గందరగోళం లేదు’ అని చెప్పారు.
జీవికా దీదీలకు నెలకు రూ.30వేలు : తేజస్వీ యాదవ్ హామీ
బీహార్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆర్‌జేడీ నాయకులు తేజస్వీ యాదవ్ కీలక హామీ ప్రకటించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జీవికా దీదీ కమ్యూనిటీ మొబిలైజర్లకు నెలకు రూ.30వేలు చొప్పున నెలవారీ వేతనం చెల్లిస్తామని పేర్కొన్నారు. వారిని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. వారు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తామన్నారు.
అలాగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీష్ ప్రభుత్వం మహిళల ఖాతాలో రూ.10 వేలు వేయడాన్ని లంచంగా తేజస్వీయాదవ్ అభివర్ణించారు. ఇది సాయం కాదని రుణం అని అమిత్‌షా కూడా పేర్కొన్నట్లు గుర్తుచేశారు. కాబట్టి భవిష్యత్‌లో ఆ మొత్తాన్ని తిరిగి వసూలుచేస్తారని విమర్శించారు. కాగా, బీహార్‌లో 2007లో జీవిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయం సహాయక సమూహాలు ఏర్పాటుచేయడం, వారికి రుణాలు, శిక్షణ, ఉద్యోగ అవకాశాలు అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. బీహార్ సుమారు 10 లక్షల మంది వరకు జీవికా దీదీలు ఉన్నారు.
సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించిన వ్యక్తిని పార్టీలో చేర్చుకున్న బీజేపీ
ఒక మోసం కేసులో సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించిన మాజీ ఎంపి, ఆర్‌జెడి నాయకుడు అనిల్ సహానీ బుధవారం బీజేపీ పార్టీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇన్‌చార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే సమక్షంలో సహానీ కాషాయ పార్టీలో చేరారు. రాజ్యసభ ఎంపిగా ఉన్నసమయంలో లీవ్ ట్రావెల్ కన్సెషన్ పొందేందుకు ప్రయాణం చేయకుండానే నకిలీ విమాన టిక్కెట్లను దాఖలు చేశారనే కేసులో సిబిఐ కోర్టు 2012లో సహానీ దోషిగా నిర్ధారించింది. దీంతో మూడేండ్ల పాటు సహాని నిషేధం ఎదుర్కొన్నారు.