నిర్బంధాలు-ఆంక్షలకు స్వస్తి
సౌదీలో కఫాలా వ్యవస్థ రద్దు
లక్షలాది మంది విదేశీ కార్మికులకు ప్రయోజనం
రియాద్ : దశాబ్దాలుగా కొనసాగుతున్న కఫాలా వ్యవస్థను సౌదీ అరేబియా రద్దుచేసింది. దేశంలో నివసిస్తున్న లక్షలాది విదేశీ కార్మికుల జీవితాలు, హక్కులను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను రద్దు చేస్తూ జూన్‌లో తీసుకున్న చారిత్రక నిర్ణయంతో సంక్షేమ, కార్మిక హక్కులు మెరుగుపడుతున్నాయి. వివిధ దేశాలు…ముఖ్యంగా దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల నుంచి వచ్చిన 1.3 కోట్ల మంది వలస కార్మికులకు ఈ నిర్ణయం ప్రయోజనం కలిగిస్తుంది. కఫాలా అంటే అరబ్ భాషలో ‘సెన్సార్‌షిప్’ అని అర్థం. దీని ప్రకారం ఉద్యోగులపై దాదాపుగా యాజమాన్యాలకే పూర్తి నియంత్రణ ఉంటుంది. ఉద్యోగం మారాలన్నా లేదా దేశం విడిచి వెళ్లిపోవాలన్నా వారిదే నిర్ణయం. న్యాయ సహాయం పొందాలన్నా యజమానుల అనుమతి తప్పనిసరి.
యజమానులదే నిర్ణయాధికారం
1950వ దశకంలోనే ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. చమురు సాయంతో సుసంపన్నమైన గల్ఫ్ ఆర్థిక వ్యవస్థలను నిర్మించడానికి చౌకగా లభించే విదేశీ కార్మికుల వ్యవహారాల పర్యవేక్షణ నిమిత్తం తొలుత ఈ వ్యవస్థను ఉద్దేశించారు. ప్రతి వలస కార్మికుడు కఫీల్‌గా పిలవబడే స్థానిక స్పాన్సరర్ చెప్పుచేతల్లో ఉంటాడు. కార్మికుల నివాసం, ఉద్యోగం, చట్ట ప్రతిపత్తి వంటి విషయాలలో అతనికి అధికారం ఉంటుంది. అయితే అనేక దశాబ్దాలుగా ఈ వ్యవస్థ దుర్వినియోగం అవుతోంది.
ఉద్యోగుల పాస్‌పోర్టులను యాజమాన్యాలు స్వాధీనం చేసుకోవచ్చు. వేతనాలు ఆలస్యంగా ఇవ్వవచ్చు. లేదా నిరాకరించవచ్చు. కార్మికుల కదలికలపై ఆంక్షలు విధించవచ్చు. స్పాన్సరర్ అనుమతి లేకుండా కార్మికులు ఉద్యోగాలు మారలేరు. స్వదేశానికి పోలేరు. యజమానులు తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ అధికారులకు ఫిర్యాదు సైతం చేయలేదు. కఫాలా వ్యవస్థను హక్కుల సంఘాలు ఆధునిక బానిసత్వంతో పోలుస్తాయి.
స్పాన్సర్‌షిప్ ముసుగులో…
వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలంటూ మానవ హక్కుల సంఘాలు, అంతర్జాతీయ కార్మిక సంస్థలు, వివిధ దేశాల ప్రభుత్వాలు చాలా కాలంగా కోరుతున్నాయి. స్పాన్సర్‌షిప్ ముసుగులో గల్ఫ్ దేశాలు బలవంతంగా పనులు చేయిస్తున్నాయని, కార్మికుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయని అంత ర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ), పలు స్వచ్ఛంద సంస్థలు ఆరోపించాయి. సౌదీ జనాభాలో 42 శాతం మంది వలస కార్మికులే.
ఇంటి పనులు, నిర్మా ణాలు, వ్యవసాయం, ఇతర రంగాల్లో పనుల కోసం సౌదీ అరేబియా వారి పైనే ఆధారపడుతోంది. వలస కార్మికుల్లో ఎక్కువ మంది భారత్, బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన వారే. ఇంటి పనులు చేస్తున్న వారి పరిస్థితి సౌదీలో మరింత దుర్భరంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళల పరిస్థితి దయనీయం. వారిది అక్కడ ఒంటరి బతుకే. చట్టపర మైన రక్షణ పరిమితంగానే ఉంటుంది. అధిక పనిగంటలు, జీతాల ఎగవేత, అవమానాలపై అనేక ఆరోపణలు ఉన్నాయి.
గల్ఫ్ దేశాలు సైతం..
అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా సౌదీ అరేబియా ఎట్టకేలకు సంస్కరణలకు సిద్ధమైంది. ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఇప్పుడు సౌదీ బాటలోనే నడుస్తున్నాయి. ఖతార్ ప్రభుత్వం 2022 ఫిఫా ప్రపంచకప్‌కు ముందు కార్మిక చట్టాలను సవరించింది.