Thursday, October 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వాస్పత్రుల్లో అందరికీ కార్పొరేట్‌ వైద్యం

ప్రభుత్వాస్పత్రుల్లో అందరికీ కార్పొరేట్‌ వైద్యం

- Advertisement -

ప్రజల ఆరోగ్యం, విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత
ప్రతి జిల్లాకు మెడికల్‌ కాలేజీ, 600 పడకల ఆస్పత్రి
ప్రతి 30 కి.మీ పరిధిలో డయాలసిస్‌ సెంటర్‌
త్వరలో 80 ట్రామా సెంటర్ల ఏర్పాటు : వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ


నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలోని ప్రజలందరికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌ వైద్యం అందించడం ప్రభుత్వ ధ్యేయమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత హెల్త్‌ క్యాంపును మంత్రి ప్రారంభించారు. స్వయంగా మంత్రి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సమాజ బాధ్యతతో ప్రజల ఆరోగ్యం, విద్య, వైద్యానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు.

ఎంతటి వైద్యం అయిన జిల్లా కేంద్రాల్లోనే చికిత్స అందించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పోలీసు కుటుంబాల కోసం ప్రత్యేకంగా హెల్త్‌ క్యాంపు నిర్వహించటం చక్కని ఆలోచన అని, ఈ క్యాంపులో 13 రకాల వైద్య నిపుణులైన డాక్టర్లు పాల్గొంటున్నారని అన్నారు. రాష్టంలో 160 డయాలసిస్‌ సెంటర్లు ఉన్నా సరిపోవడం లేదని, అందుకే ప్రతి 30 కి.మీకి ఓ డయాలసిస్‌ సెంటర్‌ ఉండేలా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. అలాగే, హైవేలపై ప్రమాదాలు జరిగే బ్లాక్‌ స్పాట్లను గుర్తించి గోల్డెన్‌ అవర్‌ను దృష్టిలో పెట్టుకొని హైవేలపై త్వరలో 80 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. జిల్లాకో క్యాన్సర్‌ డే కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి కిమోథెరఫీ చికిత్స అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసి వాటికి అనుసంధానంగా 600 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

సంగారెడ్డి జిల్లాలో మెడికల్‌ కాలేజీ, 500 పడకల ప్రభుత్వాస్పత్రి, పారామెడికల్‌ కాలేజీ, క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌, అందోల్‌లో నర్సింగ్‌ కాలేజీ, 5 కొత్త పీహెచ్‌సీలను, మూడు కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బిల్డింగ్‌లను ప్రారంభించామన్నారు. వట్‌పల్లిలో సీహెచ్‌సీ, తెల్లాపూర్‌లో యుపీహెచ్‌సీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పటాన్‌ చెరు, నారాయణఖేడ్‌ ఏరియాస్పత్రుల్లో డయాలసిస్‌ సెంటర్స్‌ను ఏర్పాటు చేశామని, మరో మూడు సబ్‌ హెల్త్‌ సెంటర్లను మంజూరు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐసీసీ చైర్‌ పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్‌ పి.ప్రావీణ్య, ఎస్పీ పరితోష్‌ పంకజ్‌, ప్రముఖ వైద్యులు కిరణ్‌ కుమార్‌, ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్లు రాజు గౌడ్‌, సెక్రెటరీ ఆనంద్‌, శ్రీధర్‌, శ్రీహరి, జిల్లా పోలీస్‌ అధికారులు, వారి కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -