Friday, November 14, 2025
E-PAPER
Homeజాతీయంఇండియా బ్లాక్‌ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్‌

ఇండియా బ్లాక్‌ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్‌

- Advertisement -

ప్రకటించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌గెహ్లాట్‌
బీహార్‌లో సంక్లిష్ట సామాజిక నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీహార్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. నేతల ప్రచారాలు, అభ్యర్థుల నామినేషన్లు కోలాహలంగా జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ తమ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. దీంతో అధికార ఎన్డీఏకు సవాల్‌ విసిరింది. ఎన్డీఏ సీఎం అభ్యర్థి ఎవరంటూ ప్రశ్నిస్తోంది. అలాగే ఎన్నికలకు ముందు ఇండియా బ్లాక్‌ భాగస్వామ్య పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలకు ముగింపు పలికి ఐక్యతను ప్రదర్శించేందుకు ప్రయత్నంగా దీనిని భావిస్తున్నారు. ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ పేరును కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌గెహ్లాట్‌ ప్రకటించారు.

గురువారం పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీలను సంప్రదించిన అనంతరం తేజస్వీయాదవ్‌ను ప్రతిపక్ష కూటమి తరపు సీఎం అభ్యర్థిగా ఎన్నుకోవాలని నిర్ణయించామని తెలిపారు. వికాస్‌ శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీి) అధ్యక్షుడు ముఖేశ్‌ సహానీని ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్నట్టు తెలిపారు. అలాగే ఇతర వర్గాల నుంచి మరో డిప్యూటీ సీఎం ఉంటారని తెలిపారు. సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ యువకుడని, ఆయనకు సుదీర్ఘ భవిష్యత్తు ఉన్నదని అన్నారు. బీహార్‌లో సంక్లిష్ట సామాజిక నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని, అయినా అధికార ఎన్డీఏ కూటమికి పట్టింపులేదని విమర్శించారు.

ఎన్డీఏ సర్కారు పాలనాతీరు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో కూడా ఎన్డీఏ సర్కారు తీరుతో నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శించారు. అధికార కూటమి పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, మార్పు కోరుకుంటున్నారని అన్నారు. తేజస్వీ యాదవ్‌ మాట్లాడుతూ ఇది తమకు పెద్ద సమస్య కాదని, కానీ మీడియా ఊహాగానాలు అధికంగా ఉన్నందున, తాము సీఎం అభ్యర్థిపై స్పష్టత ఇవ్వాలని నిర్ణయించు కున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ మీడియా, ప్రచార విభాగం హెడ్‌ పవన్‌ ఖేరా మాట్లాడుతూ తాము తమ సీఎం అభ్యర్థిని ప్రకటించడంతో ముందడుగు వేశామని, ఇప్పుడు ఈ అంశంపై సందిగ్ధతలను ఆపాలని సూచించారు. అలాగే ఎన్డీఏ సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు. కాగా బీహార్‌లో నవంబర్‌ 6, 11 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 14న ఓట్లను లెక్కించనున్నారు. అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష మహాగట్‌బంధన్‌ కూటమిల మధ్య ప్రధానంగా పోరు జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -