అమెరికా హెచ్చరిక
బిల్లుకు ఇజ్రాయిల్ పార్లమెంట్ ఆమోదం
గాజాలో కొనసాగుతున్న కాల్పులు
కైరో/టెల్ అవీవ్ : వెస్ట్‌బ్యాంక్‌ను ఆక్రమించు కోవడానికి ఇజ్రాయిల్ తీసుకుంటున్న చర్యల వల్ల గాజా శాంతి ఒప్పందానికి ముప్పు ఎదురవుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో హెచ్చరించారు. వెస్ట్‌బ్యాంక్‌ను స్వాధీనం చేసుకునే దిశగా ఇజ్రాయిల్ పార్లమెంట్ తీసుకుంటున్న చర్యలతో గాజాలో యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ చేపట్టిన ప్రణాళిక ప్రమాదంలో పడుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఇజ్రాయిల్ పార్లమెంట్‌లో జరిగేది ఓటింగ్ అయినా కానీ తాము ఈ చర్యకు ఇప్పుడు మద్దతు ప్రకటించలేమని ట్రంప్ స్పష్టం చేశారని తెలిపారు.. దీనివల్ల శాంతి ఒప్పందానికి ముప్పు కలిగించే అవకాశం వుందని భావిస్తున్నామన్నారు. బుధ వారం ఆయన ఇజ్రాయిల్‌కు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మార్క్ రూబియో ఇజ్రాయిల్‌కు రావడం ఇదే మొదటిసారి.
బిల్లు ఆమోదం
ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయిల్ సార్వ భౌమత్వాన్ని రుద్దేందుకు ఉద్దేశించిన ప్రాథమిక బిల్లును బుధవారం ఇజ్రాయిల్ పార్లమెంట్ ఆమోదించింది. పాలస్తీనా భూభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు అంత ర్జాతీయ చట్టాలను ఉల్లంఘి స్తోంది. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ, ఆయన నేతృత్వంలోని లికుడ్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించి నప్పటికీ బిల్లు రెండో దశకు చేరుకుంది. బిల్లు చట్టంగా మారాలంటే నాలుగు సార్లు పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంటుంది. మొదటిసారి జరిగిన ఓటింగులో బిల్లును 25 మంది సమర్ధించగా 24 మంది వ్యతిరేకించారు.
ఇజ్రాయిల్ పార్లమెంటులో 120 మంది సభ్యులు ఉన్నారు. నెతన్యాహూ భాగస్వామ్య పార్టీలకు చెందిన కొందరు సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. జాతీయ భద్రతా శాఖ మంత్రి ఇతామర్ బెన్-గ్విర్ నేతృత్వంలోని జేవిష్ పవర్ పార్టీ, ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్ నాయకత్వంలోని రెలిజియస్ జియొనిజం ఫ్యాక్షన్ సభ్యులు కొందరు బిల్లును సమర్ధించారు. లికుడ్ పార్టీకి చెందిన పలువురు సభ్యులు గైర్హాజరయ్యారు. కొందరు సభలో వున్నప్పటికీ ఓటేయలేదు. ఒక సభ్యుడు నెతన్యాహూను ధిక్కరించి బిల్లుకు అనుకూలంగా ఓటేశారు.
అమెరికా నేతలకు వినిపించని కాల్పులు
కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయిల్ తూట్లు పొడుస్తున్నా అమెరికా నేతలకు అదేమీ కన్పించడం లేదు. తాము ఆశించిన దాని కంటే కాల్పుల విరమణ ఒప్పందం బాగానే అమలవుతోందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ప్రతినిధులు చెప్పుకొచ్చారు. జెరుసలేంలోని ప్రధాని కార్యాలయంలో వారు నెతన్యాహూతో సమావేశ మయ్యారు. గత కొద్ది రోజులుగా హింస పెరుగుతున్న మాట నిజమేనని వాన్స్ అంగీకరించారు. కానీ కాల్పుల విరమణ తాను ఆశించిన దాని కంటే మెరుగ్గానే ఉన్నదని చెప్పారు. మధ్యప్రాచ్య వ్యవహారాల ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
స్మశానాలే ఆవాసాలు !
గాజాలో దీర్ఘకాలంగా కొనసాగిన దాడులతో ఎక్కడికక్కడ శిధిలాల కుప్పలు, రాళ్ళ దిబ్బలు మిగలడంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలియక నిర్వాసితులు స్మశానాలను ఆశ్రయించారు. సమాధుల పక్కనే శిబిరాలు ఏర్పాటు చేసుకుని పిల్లజెల్లాతో వుంటు న్నారు. నీరు లేదు, విద్యుత్ లేదు కేవలం బతకడానికి ఎక్కడో ఒక చోటు వుండాలి కాబట్టి ఇక్కడకు వచ్చామని ఒక గృహిణి వాపోయింది. గాజాలో దాదాపు 19లక్షలమంది అంటే 90శాతం మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. వీరిలో చాలామంది కనీసం వందలసార్లు వున్న చోట్లు మారుతూ వచ్చారని ఐక్యరాజ్య సమితి వర్గాలు పేర్కొన్నాయి.
ఆగని కాల్పులు
దక్షిణ గాజా లోని ఖాన్ యూనిస్ తూర్పు ప్రాంతాల్లో, ఉత్తర గాజా ప్రాంతాల్లో రాత్రిపూట నిరంతరంగా కాల్పులు జరుగుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ”తుపాకీ కాల్పులు లేదా పేలుళ్లు ఉదయం వరకు ఆగలేదని, తమ. ముగ్గురు పిల్లలు పొద్దునే మేల్కొని యుద్ధం మళ్లీ మొదలైందా అంటూ తనను అడిగారని సెంట్రల్ గాజాలో నివసిస్తున్న రైతు మొహమ్మద్ అబూ మస్సర్ పేర్కొన్నారు. ”ఇదంతా ఎప్పుడు ముగుస్తుంది, తామందరం భయం లేకుండా సాధారణ జీవితాలను ఎప్పుడు ప్రారంభిస్తా మోనంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాల్పుల్లో, దాడుల్లో గాయపడిన, అనారోగ్యంతో వున్న దాదాపు 15వేలమంది పాలస్తీని యన్లకు విదేశాల్లో చికిత్సనందించేందుకు అనుమతించాల్సిందిగా ఐక్యరాజ్య సమితి ఇజ్రాయిల్‌ను కోరింది.



