రెండు భారీ ఆయిల్ కంపెనీలపై ఆంక్షలు
పుతిన్‌తో భేటీ రద్దు, మాస్కో అణువిన్యాసాల నేపథ్యంలో కీలక పరిణామం
అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం
వాషింగ్టన్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందు పడటం లేదు. రష్యాను ఎలాగైన కట్టడి చేయాలనే ఆలోచనలో అమెరికా అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నది. డోనాల్డ్ ట్రంప్.. మాస్కోపై కఠిన చర్యలకు దిగారు. రష్యాలోని రెండు అతిపెద్ద ఆయిల్ కంపెనీలు రోస్నెఫ్ట్, లుకోయిల్‌లపై ఆంక్షలు విధించారు. రష్యా ఆయిల్ కంపెనీలను టార్గెట్ చేసుకుంటూ విధించిన ఈ ఆంక్షలపై యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్రకటన చేసింది. ఇప్పటి వరకు రష్యా ఎనర్జీ సెక్టార్ (ఆయిల్, గ్యాస్ వంటివి)పై భారీ ఆంక్షలు విధించేందుకు యూఎస్ ప్రభుత్వం వెనుకాడేది. జాగ్రత్త వహించేది. అయితే యూఎస్ అకస్మాత్తుగా తన వైఖరిని మార్చుకున్నదనీ, ఇందులో భాగంగానే తాజాగా భారీ ఆంక్షలు విధించిందని అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు.
ట్రంప్, పుతిన్ ల మధ్య హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరగాల్సిన భేటీ అనూహ్యంగా రద్దు కావటం, మరోపక్క అణువిన్యాసాలు చేపడుతున్న తరుణంలో అమెరికా నుంచి ఈ ఆంక్షల నిర్ణయం రావటం గమనార్హం. తాజా ఆంక్షలతో యూఎస్ కంపెనీలు, వ్యాపారవేత్తలు సదరు ఆయిల్ కంపెనీలతో వ్యాపారం చేయలేరు. మరోపక్క యూఎస్ రెండోసారి ఆంక్షలు విధించేందుకు కూడా సంకేతాలు పంపుతున్నది. అమెరికా తీసుకున్న ఆ ఆంక్షల నిర్ణయంతో చమురు ధరలు పెరిగి అంతర్జాతీయ మార్కెట్‌పై ప్రభావం పడిందని విశ్లేషకులు, నిపుణులు చెప్తున్నారు.వాస్తవానికి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు అంశంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉన్నది. యుద్ధం ముగింపునకు రష్యా కట్టుబడి పని చేయని కారణంగానే ఈ కఠిన ఆంక్షలు అని అమెరికా వాదిస్తున్నది. ఇందులో భాగంగా రష్యా ఆదాయ వనరును దెబ్బ కొట్టాలని ట్రంప్ భావిస్తున్నాడు.
ఇందులో భాగంగానే చమురు ద్వారా రష్యాకు వచ్చే రెవెన్యూను క్రమంగా తగ్గించాలని ప్రయత్నిస్తున్నాడు. రష్యా నుంచి చమురు కొంటున్న పలు దేశాలపై ఆంక్షలు, సుంకాలు విధిస్తున్నాడు. ఈ కారణంగానే భారత్, చైనాలపై అమెరికా సుంకాలు విధించిన విషయం విదితమే. ప్రస్తుతం అమెరికా ఆంక్షలు విధించిన రోస్నెఫ్ట్, లుకోయిల్‌లు రష్యా ఆయిల్ అవుట్‌పుట్‌లో భారీ వాటాను కలిగి ఉండటమేగాక ఆ దేశానికి పెద్ద ఎత్తున రెవెన్యూకు కారణమవుతున్నాయి. అందుకే ఈ రెండింటిని టార్గెట్ చేసుకుంటూ ట్రంప్ ఆంక్షలు విధించారని విశ్లేషకులు చెప్తున్నారు.అమెరికా ఆంక్షల నిర్ణయం చమురు వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరఫరాపై ప్రభావం పడి అంతర్జాతీయ ధరలు పెరగనున్నాయి.
రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే దేశాలు పనరాలోచనలో పడనున్నాయి. అమెరికా విధించే ఆంక్షల ప్రభావం రష్యాపై ఏ మాత్రమూ ప్రభావం చూపదని కొంత మంది విశ్లేషకులు వాదిస్తున్నారు. ఎందుకంటే రష్యా ప్రధాన ఆదాయ వనరు దేశీయ ఉత్పత్తిపై విధించే పన్నుల ద్వారానే అధికంగా వస్తుందనీ, ఇది పూర్తిగా ఎగుమతులపై ఆధారపడదని అంటున్నారు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే, ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాలు ఏ విధంగా వ్యవహరించబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. భారత్ విషయంలో ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటన కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నది. ట్రంప్ చెప్పినట్టుగానే భారత ప్రధాని మోడీ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలున తగ్గిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందేనని నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు.
రష్యాపై ట్రంప్ కఠిన చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



