25 ఏండ్లలో అనేక రాజీలేని పోరాటాలు చేసిన మత్స్యకారులు
సంక్షేమ పథకాల పేరుతో నిరుపేద మత్స్యకారులకు అన్యాయం
సంపన్న వర్గాలకు వేలకోట్ల రాయితీలు, రుణాలు, సబ్సిడీలు
పదేండ్ల మోడీ పాలనలో బడాబాబులకు రూ. 60లక్షల కోట్లు మాఫీ
బడ్జెట్‌లో మన వాటా రాబట్టుకునేందుకు పోరాటాలకు సిద్ధం కావాలి
తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం సిల్వర్ జూబ్లీ వేడుకలు
హాజరైన మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర చేనేత వృత్తిదారుల గౌరవ అధ్యక్షులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో నిరుపేద మత్స్యకారులకు వృత్తిదారులకు ఎంగిలి మెతుకులు విసురుతూ పాలక వర్గాలు అన్యాయం చేస్తున్నాయనీ, కోటాను కోట్లకు పడగలు ఎత్తిన సంపన్న వర్గాలకు అనేక రాయితీలు, రుణాలు, సబ్సిడీలు ఇస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర చేనేత వృత్తిదారుల సంఘం గౌరవ అధ్యక్షులు చెరుపల్లి సీతారాములు విమర్శించారు. తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం (టీఎంకేఎంకేఎస్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం సిల్వర్ జూబ్లీ(2001-2025) ఉత్సవాలు హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నరసింహ అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ సంఘం 25 ఏండ్ల ప్రస్థానం, ఈ కాలంలో మత్స్యకార్మికుల సమస్యల పరిష్కారానికి చేసిన పోరాటాలు, సాధించిన విజయాల గురించి వివరించారు.
అనంతరం చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. గడిచిన 25 ఏండ్లుగా టీఎంకేఎంకేఎస్ మత్స్యకారుల వృత్తి రక్షణ, ఉపాధి, జీవిత భద్రత కోసం అనేక రాజీలేని పోరాటాలు నిర్వహించిందన్నారు. ఈ పోరాటాల్లో కొన్ని విజయాలు సాధించినట్టు చెప్పారు. ఉద్యమాలు, పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోగలుగుతామని చెప్పారు. పదేండ్ల మోడీ పాలనలో బడాబాబులకు రూ.60లక్షల కోట్లు మాఫీ చేశారని గుర్తుచేశారు. అనిల్ అంబానీ, సుబ్బరామిరెడ్డి లాంటి పారిశ్రామికవేత్తలకు రూ.4వేలకోట్లకు పైగా రుణాలను కేంద్రం మాఫీ చేసిందని తెలిపారు. అదే సమయంలో పేద మత్స్యకారులు, వృత్తిదారుల అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయింపులు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయింపులకు, అభివృద్ధికి పోరాటాలే మార్గమనీ, మత్స్యకారులు తమ బతుకుల్లో మార్పునకు పోరాటాలకు సిద్దం కావాలనీ, పోరాడితే తప్ప సమస్యలు పరిష్కరం కావన్నారు.
టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. జల వనరులపై పూర్తి హక్కులు, ప్రతి గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో రిటైల్ హౌల్‌సెల్ చేపల మార్కెట్లు ప్రభుత్వమే నిర్మాణం చేసి ప్రజలకు పోషక విలువలు కలిగిన చేపల ఆహారాన్ని తద్వారా మత్స్యకారులకు ఆర్థిక ఆదాయాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని, ప్రతి మత్స్య సొసైటీ బ్యాంకు అకౌంట్లలో రూ.10 లక్షల నగదు జమ చేయాలని కోరారు. ఆనాటి నుంచి నేటి వరకు దేశ, రాష్ట్రంలోని అనేక పరిణామాలను, ఘటనలను ఎదుర్కొంటూ సంఘం ముందుకు పోతున్నదనీ, మత్స్యకారుల సమస్యలపై సంఘం అనేక రాజీలేని పోరాటాలు నిర్వహించి ఎన్నో విజయాలు సాధించిందన్నారు. అనంతరం మత్స్య రంగంలోని 25 మంది ప్రముఖులను సత్కరించారు.
ఇందులో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆర్టిస్టు బైరి రఘురాం, అనేక దేశాల్లో ప్రశంసలు అందుకున్న కార్టూనిస్టు జేవీ వెంకటేశ్, ప్రముఖ సింగర్ గుర్రం సదానంద్, పాటల గోపి, తులసింగారి నరసింహ, ఆర్ సైదులు, మత్స్యకారుల సంఘం రాష్ట్ర నాయకులు కొప్పు పద్మ, గాండ్ల అమరావతి బొంది నర్సింగరావు, బక్కీ బాలమణి, సిద్దేశ్వర్, గోరింకల నరసింహా, లెల్లెల బాలకృష్ణ, గణేష్, వెంకన్న, చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు చెరుపల్లి సీతారాములు, ఎంవీ రమణ, పి.ఆశయ్య, కూరపాటి రమేశ్ తదితరులు ఉన్నారు. ఈ వేడుకల్లో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్నమోని శంకర్, రాష్ట్ర కార్యదర్శి గొడుగు వెంకట్, నగర నాయకులు కె.అరుణ, నవనీత, మామిండ్ల జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.



