గోవధ నిషేధ చట్టం తీసుకురావాలి :బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్‌రావు
డీజీపీ కార్యాలయ ముట్టడి పిలుపు నేపథ్యంలో బీజేపీ నేతల అరెస్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? గోవులను కోసేవాళ్లకు ఏమైనా లైసెన్స్ ఇచ్చారా? గోవులను రక్షించే ప్రశాంత్‌సింగ్‌పై అభాండాలు మోపడమేంటి? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నది రేవంత్‌రెడ్డి సర్కార్ కాదనీ, రేవంతుద్దీన్ ప్రభుత్వమని విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లో డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రాంచందర్‌రావుతో పాటు పలువురు నేతల్ని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. పలువురు నేతలను హౌస్ అరెస్టు చేశారు. అరెస్టు సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. డీజీపీకి వినతిపత్రం ఇస్తామని చెప్పినా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రశాంత్ పై హత్యాయత్నం చేసినవారిని కాపాడే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు.
ప్రశాంత్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో గన్‌కల్చర్ పెరిగిపోతున్నదని విమర్శించారు. గన్‌పార్కు వద్ద ఆయన్ను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ.. మేడ్చల్, శామీర్ పేట్, కీసర, ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిత్యం కొన్ని వందలాది ట్రక్కుల్లో గోవులను తరలిస్తున్నారనీ, ఈవిషయం తన దృష్టికి కూడా వచ్చిందని తెలిపారు. ఇది ఒక మాఫియాలా తయారైందని, కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. గోవుల తరలింపును అడ్డుకున్న వారిని ట్రక్కులతో ఢకొీట్టడం, కత్తులతో దాడి చేసి గన్‌లతో కాల్పులు జరపడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. హిందూ ధర్మ రక్ష ఫౌండర్, బీజేపీ రాష్ట్ర నాయకులు చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందన్నారు. పోలీసులంటే ప్రజలను రక్షించాలని, తామున్నామనే భరోసా ఇవ్వాలని కోరారు.



