కార్మిక వ్యతిరేక చట్టాలు గొడ్డలి పెట్టు: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
మహబూబాబాద్ జిల్లా గార్లలో ప్రారంభమైన గ్రామ పంచాయతీ
ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర మహాసభలు
భారీ ప్రదర్శనలో కార్మికులు
నవతెలంగాణ-గార్ల
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలు.. సంఘటిత, అసంఘటిత కార్మికులకు గొడ్డలి పెట్టు అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్లలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర 5వ మహాసభలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమ య్యాయి. ముందుగా స్దానిక సీఐటీయూ కార్యాలయం నుంచి ఏవీఆర్ ఫంక్షన్‌హాల్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏవీఆర్ ఫంక్షన్ హల్‌లో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గ్యారా పాండు అధ్యక్షతన జరిగిన బహిరంగసభ నిర్వహించారు. యూనియన్ జెండాను సంఘం రాష్ట్ర అధ్యక్షులు గ్యారా పాండు ఆవిష్కరించారు. బహిరంగ సభ ప్రాంగణంలో సీనియర్ నాయకులు అమరజీవి బూడిద అరుణ్ గౌడ్ చిత్ర పటానికి పాలడుగు భాస్కర్, నాయకులు వంగూరి రాములు, మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్, నాయకులు అలవాల రామకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం జరిగిన సభలో పాలడుగు భాస్కర్ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను అమలుచేస్తూ సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల హక్కులను హరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే కార్మికుల పని గంటలను పెంచారని తెలిపారు. మోడీ ప్రభుత్వానికి కులం, మతంపై రాజకీయాలు తప్ప.. కార్మికుల సంక్షేమం ఏ మాత్రం పట్టదని విమర్శించారు. జీపీ కార్మికులకు ఇబ్బందిగా మారిన మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి రానున్న రోజుల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో బలమైన ఉద్యమాలు నిర్వహిస్తామని పునరుద్ఘటించారు.
సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు మాట్లాడుతూ.. గ్రామాలు పరిశుభ్రంగా ఉండటానికి మూలం గ్రామ పంచాయతీ కార్మికులేనని అన్నారు. అలాంటి కార్మికులు ఎప్పటికైనా ఉద్యోగ భద్రతా ఉంటుందనే ఆశతో ఎలాంటి పనైనా చేస్తున్నారని అన్నారు. జీపీ కార్మికుల సమస్యలపై సీఎంకు, మంత్రులకు పలుమార్లు వినతి పత్రాలు అందించినా స్పందించడం లేదని తెలిపారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా రూ.26 వేలు కనీస వేతనాలు ఇవ్వాలని, సంక్షేమ పథకాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, జీపీ కార్మికుల్లో అర్హత, అనుభవం ఉన్న వాళ్లను జీపీవోలుగా నియమించాలని డిమాండ్ చేశారు. రానున్న పోరాటాల్లో జీపీ కార్మికులందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్. రమ మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో పారిశుధ్య పనులు చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సంక్షేమానికి కృషి చేయని ఏ ప్రభుత్వం పైనయినా పోరాటానికి కార్మికులు సిద్ధంగా ఉండాలని అన్నారు.
తెలంగాణ గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, సిఐటియు రాష్ట్ర నాయకులు పాలడుగు సుధాకర్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు జీపీ కార్మి కులకు వేతనాలు ఇవ్వలేదని, మంత్రులు కూడా స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాభవన్ ముందు అందోళన జరిపి జీపీ కార్మికులకు దిక్సూచిగా నిలిచిన సంఘం సీఐటీయూ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ సభలో సీఐటీయూ జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఆకుల రాజు, కుంట ఉపేందర్, నాయకులు కుమ్మరికుంట్ల నాగన్న, యూనియన్ జిల్లా కార్యదర్శి బండ్ల అప్పిరెడ్డి, ఐద్వా జిల్లా నాయకురాలు అలవాల సత్య వతి, యూనియన్ మండల అధ్యక్షులు పిడమర్తి దాస్, కార్యదర్శి దస్తగిరి, వివిధ జిల్లాలకు చెందిన గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు..



