Saturday, October 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమద్యం షాపుల అప్లికేషన్ల గడువు ఎలా పెంచారు : హైకోర్టు

మద్యం షాపుల అప్లికేషన్ల గడువు ఎలా పెంచారు : హైకోర్టు

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్‌
మద్యం షాపుల ఎంపిక కోసం అప్లికేషన్ల సమర్పణ గడువును ఈ నెల 18వ తేదీగా నిర్ణయించాక దానిని ఈ నెల 23వ తేదీకి ఎలా మార్పు చేశారో చెప్పాలని రాష్ట్రాన్ని హైకోర్టు ఆదేశించింది. దుకాణాల కేటాయింపు నిమిత్తం దరఖాస్తుల సమర్పణ గడువు పొడిగింపునకు ఉన్న చట్ట నిబంధనలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించింది. ప్రభుత్వ వివరణను బట్టి గడువు పెంపుపై స్టే ఇవ్వడమా? ఈ నెల 18వరకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా షాపుల కేటాయింపు చేయాలా? అనే దానిపై ఆదేశాలిస్తామని తెలిపింది. విచారణను శనివారానికి వాయిదా వేసింది. మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 18 నుంచి 23వరకు పొడిగింపునకు ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను హైదరాబాదీ వెంకటేశ్వర్‌రావు ఇతరులు వేసిన పిటిషన్లను జస్టిస్‌ తుకారాంజీ శుక్రవారం విచారించారు.నోటిఫికేషన్‌ రూల్స్‌ను మార్పు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్‌ లాయర్‌ వాదించారు. ఇదేవిధంగా ఏపీలో చేస్తే అక్కడి హైకోర్టు అడ్డుకుందని చెప్పారు. కొన్ని జిల్లాల నుంచి గడువు పెంచాలనే ప్రతిపాదన వస్తే చట్ట వ్యతిరేకంగా ఉన్నతాధికారులు గడువు పెంచారని చెప్పారు.

దీనిపై ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ దుకాణాల కేటాయింపు ప్రక్రియ విధానపరమైనదనీ, దీనిలో కోర్టుల జోక్యానికి ఆస్కారం తక్కువని చెప్పారు. 18న బంద్‌ జరగడం వల్ల, సాంకేతిక సమస్యల వల్ల గడువు పెంచాల్సి వచ్చిందని వివరించారు. గడువు తర్వాత 5793 దరఖాస్తులు మాత్రమే అందాయన్నారు. స్టే ఇవ్వొద్దని కోరారు. గడువు పొడిగింపుతో అందిన అదనపు అప్లికేషన్లపై తీర్పు ఉండేలా చేయవచ్చునని చెప్పారు. షాపుల ఎంపికలో గడువు తర్వాత అప్లికేషన్లు చేసుకున్న వాళ్లు ఉంటే వాళ్లకే తీర్పు అమలు చేసేలా ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తామన్నారు. వివరణ చెప్పడానికి గడువు కావాలని కోరారు. దీంతో విచారణను శనివారానికి వాయిదా పడింది. మద్యం దుకాణాల కేటాయింపులో వికలాంగులకు రిజర్వేషన్‌ కల్పించకపోవడాన్ని సవాలు చేసిన మరో పిటిషన్‌ను కూడా హైకోర్టు విచారించింది. షాపుల కేటాయింపు ప్రక్రియపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోం
బయోమెట్రిక్‌, ఓటీపీ ఆధారిత ఓటరు విధానాన్ని అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలనే పిటిషన్‌లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై పిటిషనర్‌ వినతి పత్రంపై ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలానికి చెందిన సయ్యద్‌ జాకీర్‌ హుస్సేన్‌ వేసిన పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ నేతృత్వంలోని డివిజన్‌బెంచ్‌ కొట్టేసింది. పిటిషనర్‌ ఇచ్చిన వినతి పత్రంలోని అంశాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఈసీనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది.

తరగతులకు అనుమతించండి
హైదరాబాద్‌కు చెందిన రుస్దా ఉస్మాని అనే విద్యార్థిని ఎలాంటి షరతుల్లేకుండా తరగతులకు అనుమతించాలని ఖైరతాబాద్‌లోని నాసర్‌ పాఠశాలను హైకోర్టు ఆదేశించింది. ఆమెను రెగ్యులర్‌గా క్లాసులకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలంది. విద్యార్థిని బహిష్కరణకు కారణాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వంతోపాటు పాఠశాలకు ఆదేశాలిచ్చింది. విచారణను నవంబర్‌ మూడో తేదీకి వాయిదా వేసింది. ఆగస్టులో పాఠశాల సీలింగ్‌ ఫ్యాన్‌ పడిపోవడంతో పాక్షికంగా కంటిచూపు దెబ్బతినడంతో విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను పాఠశాల యాజమాన్యం బహిష్కరించింది. దీనిపై విద్యార్థి రుస్దా ఉస్మాని వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ నంద శుక్రవారం విచారించి పైవిధంగా ఆదేశాలిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -