నాలుగు నెలల పాటు ప్రజల్లోనే కవిత
నేడు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి యాత్రకు ప్రయాణం
సొంత జిల్లా నిజామాబాద్ నుంచి యాత్ర షురూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం శనివారం ప్రారంభం కానున్నది. ఆ యాత్ర ద్వారా జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత నాలుగు నెలల పాటు ప్రజల్లోనే ఉండనున్నారు. శనివారం హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్దనున్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి ఆమె యాత్రను ప్రారంభించనున్నారు. ఆమె తన సొంత జిల్లా అయిన నిజామాబాద్ నుంచి యాత్రను షురూ చేయనున్నారు. తెలంగాణ ప్రాంతంలో సామాజిక అంశాల అధ్యయన యాత్రగా ఈ పర్యటన సాగనున్నది. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత ఆమె కొత్త పార్టీ పెడతారని చాలా మంది భావించారు. కానీ, కవిత మాత్రం తెలంగాణ ప్రజల మనసులో ఏముందో తెలుసుకునే కార్యక్రమం చేపట్టారు. ప్రజలే గురువులని భావిస్తున్న ఆమె ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నాకే రాజకీయంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అందుకే కవిత ‘జనం బాట’ పట్టనున్నారు. ఒకరిద్దరితో ఒకటి రెండు రోజులు మాట్లాడితే తెలంగాణ ఏం కోరుకుంటుందో తెలియదు.
అన్ని వర్గాలను కలిసినప్పుడే దానిపై స్పష్టత వస్తుంది. అందుకే రైతులు, మహిళలు, కార్మికులు, యువత, మేధావులు, కుల సంఘాలు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, అమర వీరుల కుటుంబాలను జనంబాట ద్వారా కలువనున్నారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించ నున్నారు. అన్ని వర్గాలకు రాజకీయంగా అవకాశాలు అందివచ్చినప్పుడే ఆయా వర్గాలు బాగుపడతాయని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. తన నాలుగు నెలల ‘జనం బాట’ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నదే తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఎలాంటి కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లాలన్నది కూడా ఈ కార్యక్రమం ద్వారా ఆమె సిద్ధం చేయనున్నారు. మొత్తం నాలుగు నెలల పాటు తెలంగాణను సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత దానికి అనుగుణంగా కవిత కార్యాచరణ తీసుకోనున్నారు. ప్రజలు కోరుకుంటే రాజకీయపార్టీ పెట్టేందుకు తాను సిద్ధమేనని కవిత ఇది వరకే ప్రకటించిన విషయం విదితమే.



