Saturday, October 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవ్యాయామశాలల్లో స్టెరాయిడ్స్‌ అక్రమ నిల్వ

వ్యాయామశాలల్లో స్టెరాయిడ్స్‌ అక్రమ నిల్వ

- Advertisement -

డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల దాడిలో పట్టివేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

వ్యాయమశాలల్లో స్టెరాయిడ్స్‌ను అక్రమ నిల్వ ఉంచి అమ్మకాలు జరుపుతున్నారు. వీటితో పాటు గుండెకు ఉద్దీపన కలిగించే ఇంజెక్షన్లను కూడా విక్రయిస్తున్నారు. డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు (డీసీఏ) చెందిన డ్రగ్‌ ఇన్‌ స్పెక్టర్లు శుక్రవారం హైదరాబాద్‌ నగరంలోని ప్రముఖ జిమ్స్‌లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్‌, మెహిదీపట్నం, టోలిచౌకి, మలక్‌పేట్‌, పంజగుట్ట, నార్సింగి, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, కొత్తపేట్‌, కూకట్‌ పల్లి, సూరారం ప్రాంతాల్లో 20 వ్యాయమశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనబాలిక్‌ -అండ్రోజెనిక్‌ స్టెరాయిడ్స్‌తో పాటు గుండెకు ఉద్దీపన కలిగించే మెఫెటెర్మైన్‌ సల్ఫేట్‌ ఇంజెక్షన్‌ ను చట్ట విరుద్ధంగా నిల్వ ఉంచి జిమ్‌కు వచ్చే వారికి ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు.

స్థానిక పోలీసుల సహకారంతో చేపట్టిన దాడిలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కండరాల పెరుగుదల కోసం తరచూ ఇలాంటి డ్రగ్స్‌ ఉపయోగించే బాడీ బిల్డర్ల ఆరోగ్యంపై అవి దుష్ప్రభావం చూపిస్తాయని అధికారులు హెచ్చరించారు. గుండె నాళాలు, కాలేయం, తరచుగా కోపం రావడం, హార్మోన్స్‌లో అసమతుల్యతతో పాటు దీర్ఘకాలంలో సంతానలేమి సమస్యలకు, మూత్రపిండాల వైఫల్యం, మానసిక ఇబ్బందులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని వారు హెచ్చరించారు. ఆయా వ్యాయమశాలల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు డీసీఏ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -