మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లతో ఇంధన పొదుపు ట్రాఫిక్ సమస్యలకు చెక్
హైదరాబాద్ మెట్రో రెండో దశకు పటిష్టంగా అడుగులు : హెచ్‌ఎంఆర్ కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ డీవీఎస్ రాజు
విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో సదస్సు
నవతెలంగాణ-సిటీబ్యూరో
పర్యావరణ పరిరక్షణ, శబ్ద కాలుష్యం నియంత్రణలో ‘మెట్రో’ కీలక పాత్ర పోషిస్తోందని హైదరాబాద్ మెట్రో రైల్ కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ డీవీఎస్ రాజు అన్నారు. మేడ్చల్ మల్కాజ్‌రి జిల్లా బాచుపల్లి ప్రగతినగర్‌లో వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల సివిల్ ఇంజినీరింగ్ విభాగం శుక్రవారం ”పర్యావరణ సుస్థిరతకు రవాణా వ్యవస్థలో పరిశోధనలు” అనే అంశంపై నిర్వహించిన రెండ్రోజుల సదస్సును డీవీఎస్ రాజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాన నగరాల్లో విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్, పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు మెట్రో, ఎంఎంటీఎస్ వంటి ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించడం ఒక్కటే మార్గమన్నారు. ప్రభుత్వ విభాగాలు ఈ లక్ష్యంగా ప్రణాళికలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ మెట్రో రైల్ నగర ప్రజలకు ఎంతో సౌకర్యవంతమైన సేవలు అందిస్తూ, రవాణా అవసరాలను కొంత వరకు తీర్చగలుగుతోందన్నారు. అయితే, మొదటి దశలో ఎల్‌అండ్‌టీతో కలిసి పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టులో పలు సవాళ్లు ఎదురయ్యాయని, వాటిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్ట్ విషయంలో మరింత పటిష్టంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. కిలోమీటర్ మెట్రో రైల్ నడపడం అంటే ఏడు బస్సు లైన్లు, 24 కారు లైన్ల ప్రయాణంతో సమానమని, అందువల్ల మెట్రో రైల్ లేదా ఎంఎంటీఎస్ రైల్ ప్రయాణమే ట్రాఫిక్ సమస్యలను తగ్గించగలవని చెప్పారు. ఇంధన పొదుపులో మెట్రో రైలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నారు. నగరాల్లో సాధారణ వాహనాల శిలాజ ఇంధనం మొత్తం 70 శాతం కాలుష్యానికి కారణమవుతోందని వివరించారు.
మెట్రో రైలులో అతి తక్కువ విద్యుత్ వినియోగం అవుతుందని, కిలోమీటర్‌కు 10 యూనిట్ల వరకు మాత్రమే విద్యుత్ వినియోగం అవుతుందని, రైలు నడిచేటప్పుడు 35శాతం వరకు స్వీయ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. హరితహారాన్ని అభివృద్ధి చేయడంలో మెట్రో రైలు సంస్థ తగు చర్యలు చేపడుతోందని, ప్రాజెక్ట్ నిర్మాణంలో చెట్టుని తొలగించాల్సి వస్తే, అటవీ శాఖ నిబంధనలు పాటిస్తూనే కనీసం నాలుగైదు మొక్కలను నాటుతున్నామని చెప్పారు. అవసరమైన చోట చెట్టుకు ఎటువంటి హానీ తలపెట్టకుండా ట్రాన్స్‌లొకేషన్ చేస్తున్నట్టు తెలిపారు. రవాణా వ్యవస్థ అంటే ప్రజలకు అందుబాటులో ఉండేలా, పర్యావరణానికి ముప్పు కలగకుండా, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే దిశగా పరిశోధనలు జరగాలని డీవీఎస్ రాజు సూచించారు. ఈ సదస్సులో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీఆర్‌ఆర్‌ఐ) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్.వేలుమురుగన్ బృందం, విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీడీ నాయుడు, దేశవ్యాప్తంగా వివిధ విద్యాసంస్థల నిపుణులు, కళాశాల సీనియర్ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.



